శనివారం మేడారంలోని సారలమ్మ గద్దెను మొక్కుతున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. చిత్రంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఏటూరునాగారం /మంగపేట: శ్రీ సమ్మక్క – సారలమ్మ మహా జాతర చివరి రోజైన శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు కురిసిన వర్షం వల్ల మేడారంలోని రోడ్లు, పరిసర ప్రాంతాలు బురదమయంగా మారాయి. భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తడుచుకుంటూనే అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రతి జాతర సమయంలో చిరుజల్లు పడటం ఆనవాయితీ. ఈ సారి వనదేవతలు గద్దెలపై ఉన్న క్రమంలో వర్షం కురవడం శుభసూచికంగా భక్తులు భావిస్తున్నారు. అకాల వర్షం పడటం వల్ల భక్తులు తడిబట్టలతో దర్శనం చేసుకుని తన్మయత్వం పొందారు.
సమ్మక్క గద్దె వద్ద చీర సమర్పిస్తున్న మండలి చైర్మన్ ‘గుత్తా’
తిరుగు పయనం కష్టాలు
అకాల వర్షంతో మేడారం తిరుగు ప్రయాణంలో భక్తులకు వర్షం కష్టాలు ఎదురయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, పలు చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో నిలిపి వేసిన వాహనాలు దిగబడటంతో వాటిని బయటకు తీసేందుకు భక్తులు పడ రాని పాట్లు పడ్డారు. మేడారం సమ్మక్క గుడి ప్రాంతంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉన్న వాహనాలు దిగబడగా.. వీవీఐపీ, వీఐపీ వాహనాలు రెండు గంటల పాటు ఇరుక్కుపోయాయి. అలాగే మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాల్లో వెళ్తున్న భక్తులు సైతం ఇబ్బందులకు గురయ్యారు. ఊరట్టం స్తూపం నుంచి పస్రా వెళ్లే దారిలో వాహనాలు నిలిచిపోయాయి. మేడారం లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే రోడ్ల నుంచి కూడా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెడ్డిగూడెం వెళ్లే గ్రామ పంచాయతీ కార్యాలయం మూల మలుపు వద్ద రెడ్డిగూడెం వైపు నుంచి వచ్చే వాహనాలు ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది.
శనివారం సాయంత్రం అకాల వర్షంతో వ్యాపార సముదాయాల్లోకి చేరిన నీరు
దుర్వాసన
శనివారం కురిసిన వర్షంతో మేడారం పరిసరాల్లో దుర్వాసన మొదలైంది. జాతరలో భక్తులు వదిలేసిన తిను బండారాలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, కోళ్లు, మేకల వ్యర్థాలతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల వలన దుర్వాసన వస్తోంది. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన క్లోరినేషన్ పనులు చేపట్టకపోతే స్థానికులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా..
మేడారం అభివృద్ధి: ఎమ్మెల్యే సీతక్క
ములుగు: మేడారం జాతర ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మరింత అభివృద్ధి చేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీ బిడ్డగా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా జాతర నిర్వహణలో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నారు. వచ్చే 2022 మహా జాతరలో ఈ సారి ఎదురైన సమస్యలను గుర్తించి మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరారు. మొదటి రెండు రోజులు జంపన్న వాగు వద్ద నీరు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నిధుల వినియోగ విషయంలో అన్ని వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను సేకరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే బడ్జెట్ ప్రణాళికలో మార్పు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment