కోకస్‌మన్నూర్ గ్రామంలో పంటనష్టంపై రెవెన్యూ, వ్యవసాయ అధికారుల సర్వే(ఫైల్)
సాక్షి, ఇచ్చోడ(బోథ్): జిల్లాలో రైతులను ఓసారి అతివృష్టి.. మరోసారి అనావృష్టి వెంటాడుతూనే ఉంది. పంటలు నష్టపోతున్నా పరిహారం అందకపోవడం వారిని కుంగదీస్తోంది. నష్టంపై సర్వే చేసి నెలలు గడుస్తున్నా పరిహారం ఊసే లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. పంటల నష్టపరిహరం అందుతుందో లేదోనని ఎదురుచూడాల్సి వస్తోంది. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే నష్టపోతుండడంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలగా మారింది. ఏటా పంటలు నష్టపోవడంతో రైతులు ఆర్థికంగా చతికిల పడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలో 58 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు సర్వే ద్వారా గుర్తించారు.
రెవెన్యూ, వ్యవసాయ ఆధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి దాదాపుగా రెండు నెలల కావస్తున్నా పంటల నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. జిల్లాలోని 18 మండలాల్లో వర్షాల కారణంగా 58 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు కొట్టుకుపోయాయి. 45 వేల ఎకరాల్లో పత్తి, 7,500 ఎకరాల్లో సోయా, 3,750 ఎకరాలలో కంది పంటలు వరదలో కొట్టుకుపోవడంతో అపార నష్టం వాటిల్లింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు జిల్లా వ్యాప్తంగా పర్యటించి పంటల నష్టం, రైతుల వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా.. 45 వేల ఎకరాల్లో పంట వరదలకు కొట్టుకుపోయినట్లు తేల్చారు.
పంట నష్టంపై వివరాల నివేదికను జిల్లా యంత్రాంగానికి అందజేశారు. పరిహారంపై స్పష్టత ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండడంతో పంటల నష్టపరిహారంపై నిర్ణయం తీసుకునే వారు లేకపోవడంతో రైతులకు శాపంగా మారింది. పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్లముందే కొట్టుకుపోవడంతో ఆర్థికంగా నష్టపోయిన రైతులు ప్రభుత్వం అందజేసే పరిహారంతో ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించడానికి పోటీపడ్డ నాయకులు నష్టపరిహారం ఇప్పించడంలో చొరవ చూపాలని, త్వరగా ఇప్పించే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు.
సర్వే నివేదిక అందజేశాం
జిల్లా వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాం. నష్టపోయిన పంటల వివరాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి పంటల నష్టపరిహారం నిధులు విడుదల చేస్తే రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. – ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి.
Comments
Please login to add a commentAdd a comment