Compensation farmers
-
రాజకీయ అండతో పెద్దలే.. గద్దలై!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం చందనవెల్లి పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన రైతులకు అందాల్సిన పరిహారాన్ని రాజకీయ పెద్దలే గద్దలుగా భోంచేశారు. 170 మంది రైతులకు రూ.60.20 కోట్ల పరిహారం అందజేయగా.. ఇందులో సుమారు రూ.4 కోట్ల వరకు అనర్హుల పేర్లతో మెక్కేశారు. ఇప్పటికే 15 మంది రూ.2.6 కోట్లు అక్రమంగా నొక్కినట్లు యంత్రాంగం గుర్తించి వివరణ కోసం నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇదిగాక మరో రూ.2 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు సమాచారం. ఈ మొత్తంలో ఎవరెవరికి.. ఎంత దక్కిందనేది విచారణలో తేలనుంది. స్థానిక సర్పంచ్ కొలాన్ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులు, మాజీ సర్పంచ్‌లు జట్టుగా ఏర్పడి కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడవుతున్నట్లు సమాచారం. మరణించిన మాజీ సైనికుడి పేరు మీద ఉన్న ఐదెకరాల భూమిని సర్పంచ్ సోదరుడు కొలాన్ సుధాకర్‌రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా రూ.45 లక్షల పరిహారాన్ని కాజేశారని ప్రచారం జరుగుతోంది. సైనికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పదేళ్ల తర్వాత సదరు భూమిని విక్రయించుకునే వీలుంది. అయితే ఇందుకు తప్పనిసరిగా యంత్రాంగం జారీచేసిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఉండాలి. ఎన్ఓసీ లేకుండానే ఎలా కొనుగోలు చేశారన్నది, రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందన్న అంశంపై యంత్రాంగం విచారణ జరుపుతోంది. అంతేగాక అసలు భూమి లేకున్నా చాలా మంది పేర్లు డిక్లరేషన్ జాబితాలో చేర్చి పరిహారం పొందారు. కాగా, తమకు న్యాయం జరిగేంతవరకు దీక్షను కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేస్తున్నారు. బాధితుల రిలే నిరాహార దీక్ష శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. శిబిరంలో అర్ధనగ్న ప్రదర్శన చేయడంతోపాటు నోటికి నల్లరిబ్బన్ ధరించి మౌనప్రదర్శన చేశారు. పోలీసులకు బాధితుల ఫిర్యాదు.. షాబాద్ (చేవెళ్ల): చందనవెళ్లి భూముల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై బాధిత రైతులు షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి పరిహారాన్ని దౌర్జన్యంగా తీసుకున్నారని వివరించారు. చందనవెల్లి ప్రస్తుత సర్పంచ్ కొలాన్ ప్రభాకర్‌రెడ్డి, కొలన్ సుధాకర్‌రెడ్డి, శ్రీలత, బషీర్, వెంకటయ్యలపై సీఐ నర్సయ్యకు బాధిత రైతులు ఎం.సత్యనారాయణ, ఎం.రాజు, జరినాబేగం, ఎ.సత్తమ్మ, అజహర్ ఫిర్యాదు చేశారు. తమ భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని తమకు తెలియకుండా సర్పంచ్ కుటుంబీకులు పొందారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమకు న్యాయం చేయాలని గత 26 రోజులుగా రిలే నిరహార దీక్ష చేపడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. బాధితులకు తెలియకుండానే వారి చెక్కులను మద్యవర్తులు మార్చుకుని తమ ఖాతాల్లో వేసుకున్నట్లు చెప్పారు. తనకు వచ్చిన రూ.12లక్షలను మాజీ సర్పంచ్ కుమారుడు వెంకటయ్య తన ఖాతాలో వేసుకుని డబ్బులు ఇవ్వనని బెదిరించాడని జరినాబేగం ఫిర్యాదులో పేర్కొంది. చందనవెల్లి భూముల పరిహారంలో జరిగిన అక్రమాలపై సరైన విచారణ జరిపించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న సీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కలెక్టర్, తన పైఅధికారు దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. -
కాళేశ్వరం నిర్వాసితులను ఆదుకుంటాం
సాక్షి,మెదక్: కాళేశ్వరం కాలువ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శంకరంపేట కాలువకోసం భూములు అందించిన మడూర్ గ్రామ రైతులకు 26 ఎకరాలకు రూ.1కోటి94 లక్షలను 94 మంది రైతులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. కాళేశ్వరం కాలువ కోసం భూములను అందిస్తున్న రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. ప్రభుత్వ నష్టపరిహారంతో పాటు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకరంపేట కాలువ ద్వారా మండలంలోని 18 వేల ఎకరాల భూములకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. దీంతో రైతుల భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. కరువును పారదోలి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా నార్సింగి మండలంలోని శేరిపల్లి, జప్తిశివనూర్, సంకాపూర్ గ్రామాల కల్యాణలక్ష్మి, షాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రె కృపావతి, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, నూతన జెడ్పీటీసీ పట్లోరి మాధవి, నార్సింగి వైస్ ఎంపీపీ సుజాత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పట్లోరి రాజు, సర్పంచ్‌లు మల్లేశం, షరీఫ్ పాల్గొన్నారు. -
పరిహారం అందేనా..?
సాక్షి, ఇచ్చోడ(బోథ్): జిల్లాలో రైతులను ఓసారి అతివృష్టి.. మరోసారి అనావృష్టి వెంటాడుతూనే ఉంది. పంటలు నష్టపోతున్నా పరిహారం అందకపోవడం వారిని కుంగదీస్తోంది. నష్టంపై సర్వే చేసి నెలలు గడుస్తున్నా పరిహారం ఊసే లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. పంటల నష్టపరిహరం అందుతుందో లేదోనని ఎదురుచూడాల్సి వస్తోంది. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే నష్టపోతుండడంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలగా మారింది. ఏటా పంటలు నష్టపోవడంతో రైతులు ఆర్థికంగా చతికిల పడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలో 58 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు సర్వే ద్వారా గుర్తించారు. రెవెన్యూ, వ్యవసాయ ఆధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి దాదాపుగా రెండు నెలల కావస్తున్నా పంటల నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. జిల్లాలోని 18 మండలాల్లో వర్షాల కారణంగా 58 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు కొట్టుకుపోయాయి. 45 వేల ఎకరాల్లో పత్తి, 7,500 ఎకరాల్లో సోయా, 3,750 ఎకరాలలో కంది పంటలు వరదలో కొట్టుకుపోవడంతో అపార నష్టం వాటిల్లింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు జిల్లా వ్యాప్తంగా పర్యటించి పంటల నష్టం, రైతుల వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా.. 45 వేల ఎకరాల్లో పంట వరదలకు కొట్టుకుపోయినట్లు తేల్చారు. పంట నష్టంపై వివరాల నివేదికను జిల్లా యంత్రాంగానికి అందజేశారు. పరిహారంపై స్పష్టత ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండడంతో పంటల నష్టపరిహారంపై నిర్ణయం తీసుకునే వారు లేకపోవడంతో రైతులకు శాపంగా మారింది. పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులు నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్లముందే కొట్టుకుపోవడంతో ఆర్థికంగా నష్టపోయిన రైతులు ప్రభుత్వం అందజేసే పరిహారంతో ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించడానికి పోటీపడ్డ నాయకులు నష్టపరిహారం ఇప్పించడంలో చొరవ చూపాలని, త్వరగా ఇప్పించే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. సర్వే నివేదిక అందజేశాం జిల్లా వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాం. నష్టపోయిన పంటల వివరాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి పంటల నష్టపరిహారం నిధులు విడుదల చేస్తే రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. – ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి. -
ముంపు భయం..!
సాక్షి, కొత్తగూడెం (ఖమ్మం): గత నెలలో వరదలు వచ్చినప్పుడు పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని పంటలు భారీగా దెబ్బతిన్నాయి. గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక దాటితే ఇక భారీ నష్టమే. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మిస్తే భవిష్యత్తులో ముంపు భయం మరింతగా పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, ముంపు వాసులను అప్రమత్తం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం వద్ద ఈ నీటిమట్టం నిరంతరం కొనసాగుతుంది. ఇక ప్రతి ఏటా వచ్చే వర్షాలకు ప్రవాహం పెరిగితే అత్యంత వేగంగా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలో 53 అడుగుల మేర నీటిమట్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయకముందే పంటలు, 53 అడుగులకు చేరగానే పరీవాహక ప్రాంతాల్లోని రోడ్లు మునిగిపోతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చితే నష్టం అపారంగా ఉంటుంది. ఈ క్రమంలో రైతులకు ఇప్పటినుంచే ‘పోలవరం’ భయం పట్టుకుంది. ఆనకట్ట నిర్మిస్తే ప్రతి ఏటా నష్టం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవితవ్యంపై ఆందోళన.. ఎగువ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలతో పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో, భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో మొత్తం 1,258 హెక్టార్ల మేర పంటలు దెబ్బతిన్నాయి. ఇక గోదావరి ఎగపోటు కారణంగా చర్ల మండలంలోని తాలిపేరు, బూర్గంపాడు మండలంలోని కిన్నెరసాని నదులు సైతం పొంగిపొర్లుతాయి. దీంతో రైతులకు నష్టం మరింతగా పెరుగుతుంది. పోలవరం నిర్మాణం పూర్తయితే గోదావరి ఉధృతి పెరిగి భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, మంగపేట మండలాలకు సైతం ముంపు బెడద వాటిల్లే ప్రమాదం ఉంది. అప్పుడు తమ భవితవ్యమేంటని ఆయా మండలాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న గోదావరి వరదల స్థితిగతులు తెలిసిన ఈ మండలాల ప్రజలు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తమ భూములు నీటమునుగుతాయని గగ్గోలు పెడుతున్నారు. పరిహారం ప్రశ్నార్థకమే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర విభజన సమయంలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని సీతారామనగరం, శ్రీధర వెలేరు, గణపవరం, ఇబ్రహీంపేట రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని చింతూరు, వేలేరుపాడు, నెల్లిపాక, వీఆర్‌పురం మండలాలను కూడా ఏపీలో కలిపారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య విలీన మండలాల అంశం కొనసాగుతూనే ఉంది. ఈ మండలాలను తిరిగి తమ రాష్ట్రంలో కలపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. విలీన ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు ముంపునకు సంబంధించి నష్టపరిహారం అందించారు. అయితే భవిష్యత్తులో తెలంగాణలోని భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో మునిగిపోయే పంటలకు పరిహారం చెల్లింపులో తీరని అన్యాయం జరుగుతుందని, దీనిపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని తెలంగాణ రైతులు డిమాండ్ చేస్తున్నారు. బూర్గంపాడు మండలం నుంచి ఆంధ్రాలో కలిపిన గ్రామాల్లో వరద ముంపునకు గురయ్యే భూములలోకి వరదనీరు చేరేటప్పటికీ గోదావరి, కిన్నెరసాని నదులకు ఇవతల ఉన్న తెలంగాణలోని బూర్గంపాడు మండలంలో వేలాది ఎకరాలు ముగునుతాయి. అయితే ఈ గ్రామాలకు పోలవరం ముంపు ప్యాకేజీ వర్తించడం లేదు. గోదావరి వరద వచ్చినప్పుడు మొదటగా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు, సారపాక, మోతె , ఇరవెండి గ్రామాలలోని వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ భూములకు పరిహారం చెల్లించే విషయంపై స్పష్టత లేదు. భూములు ముంపునకు గురైతే తమ పరిస్థితి ఏమిటనేది స్థానికులకు ప్రశ్నార్థకంగా మారింది. కిన్నెరసానికి అవతల ఉన్న గ్రామాలు ఆం«ధ్రప్రదేశ్‌లో విలీనం కావటంతో అక్కడి ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందిస్తుంది. కాగా, కిన్నెరసాని, గోదావరి నదులకు ఇవతల ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ముంపు గ్రామాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరదలను ప్రామాణికంగా తీసుకోవాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ముంపు భూములపై నీటిపారుదల శాఖ అధికారులు బూర్గంపాడు మండలంలో సర్వే చేశారు. ఈ మండలంలోని పలు గ్రామాల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయని నిర్ధారించి అక్కడ సర్వే రాళ్లు పాతారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటంతో బూర్గంపాడు మండలం రెండు ముక్కలైంది. మండలంలోని నాలుగు రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. అయితే గతంలో వచ్చిన గోదావరి వరదలను లెక్కలోకి తీసుకుంటే ఏపీలో విలీనమైన గ్రామాల కంటే ప్రస్తుతం భద్రాచలం డివిజన్లోని బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, సారపాక, మోతె, ఇరవెండి, భద్రాచలం పరిసర గ్రామాలే ఎక్కువ ముంపునకు గురవుతాయి. గతంలో గోదావరి వరదల ముంపు రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. గోదావరి వరదలను ప్రామాణికంగా తీసుకుని పోలవరం ముంపును గుర్తించాలని మండల వాసులు కోరుతున్నారు. పోలవరం ముంపునకు గురయ్యే మండలాల్లోని వ్యవసాయ భూములకు తగిన పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలని, లేకుంటే మండలానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. బాగా నష్టపోతాం సీతారామనగరం వైపు నాకున్న భూమికి పరిహారం ఇచ్చేందుకు సర్వే చేశారు. అదే సమయంలో అంతకంటే ముందుగా మునిగే బూర్గంపాడు వైపు భూములకు ఎలాంటి సర్వే చేయలేదు. కిన్నెరసాని వరద కుడివైపు కంటే ఎడమవైపే ఎక్కువ నష్టం చేస్తుంది. అటు పరిహారం ఇచ్చి, ఇటు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి. – దారం వెంకటరెడ్డి, సంజీవరెడ్డిపాలెం భూములన్నీ మునుగుతాయి ప్రస్తుతం సీతారామనగరం వైపున ముంపునకు గురవుతాయని సర్వే చేస్తున్న భూముల ప్రకారం తీసుకుంటే బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలులో ఎక్కువ భూములు మునుగుతాయి. ప్రభుత్వాలు వేరైనా వరదముంపు మాత్రం భూముల లెవల్‌ను బట్టే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – మేకల నర్సింహారావు, బూర్గంపాడు -
రైతులకు పరిహారం రూ.5
చెన్నై: వాతావరణం సహకరించక పంట దెబ్బతిని నష్టపోయిన తమిళనాడు రైతులకు బీమా కంపెనీలు షాకిచ్చాయి. దిండిగల్, నాగపట్నం జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు రూ.10, రూ.5, రూ.4, రూ.2 చొప్పున నష్టపరిహారాన్ని విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని దిండిగల్ కేంద్ర సహకార బ్యాంక్ రైతులకు చెక్కుల రూపంలో ఫిబ్రవరిలో అందించింది. ఈ విషయంపై తమిళనాడు శాసనసభ గురువారం దద్దరిల్లింది. మాజీ మంత్రి, డీఎంకే నేత కె.పిచండి ఈ చెక్కులను సభలో ప్రదర్శించారు. ‘కరుపసామి రూ.102 ప్రీమియం కట్టినప్పటికీ ఆయనకు రూ.10 మాత్రమే నష్టపరిహారంగా అందింది. తిరుమలైసామి అనే మరో రైతు రూ.50 ప్రీమియం కట్టగా, ఆయనకు కేవలం రూ.5 నష్టపరిహారం ఇచ్చారు. ఈ చెక్కుల్ని మార్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి రూ.500తో ఖాతాను తెరవాలి. మరి వీటితో ఉపయోగం ఏముంది?’ అని ధ్వజమెత్తారు. -
ఫార్మాలో హరీశ్‌కు పరిహారం
-
ఫార్మాలో హరీశ్‌కు పరిహారం
యాచారం (ఇబ్రహీంపట్నం): ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా మంత్రి టి.హరీశ్‌రావు పరిహారం అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లిలోని సర్వే నంబరు 196లో 7–24 ఎకరాలు, సర్వే నంబరు 178లో 9–19 ఎకరాల వ్యవసాయ భూమిని 2011లో ఆయన కొనుగోలు చేశారు. మొత్తం 17.03 ఎకరాలను కొనుగోలు చేసిన మంత్రి 2012 ఫిబ్రవరి 18న యాచారం తహసీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. నక్కర్తమేడిపల్లిలో ఫార్మాసిటీకి భూ సేకరణ చేస్తున్న నేపథ్యంలో మంత్రి పట్టా భూమి సైతం ఫార్మాలో పోయింది. ఆ భూమిని టీఎస్ఐఐసీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన మంత్రి దానికి పరిహారంగా ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున రూ.2.12 కోట్లు తీసుకున్నారు. -
రైతులకు పరిహారం ఇవ్వడం లేదు
విద్యుత్ సంస్థలపై హైకోర్టుకు సీఐఎఫ్ఏ ప్రధాన సలహాదారు లేఖ సాక్షి, హైదరాబాద్: రైతుల భూముల్లో విద్యుత్ లైన్లు వేస్తున్న విద్యుత్ సంస్థలు ఆ రైతులకు పరిహా రం ఇవ్వడం లేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియే షన్స్ (సీఐఎఫ్‌ఎ) ప్రధాన సలహాదారు పి.చంగల్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. పొలాల్లో వేస్తున్న విద్యుత్ లైన్ల విషయంలో ఉభయ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు 2003 విద్యుత్ చట్టం, వర్క్స్ ఆఫ్ లైసెన్సీస్ రూల్స్ 2006కు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నాయని పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల వల్ల రైతులు కొంత భూమి కోల్పోతున్నారని, కానీ విద్యుత్ సంస్థలు పరిహారం చెల్లించడం లేదన్నారు. వారికి పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. లేఖను జస్టిస్ చల్లా కోదండరాం నేతృత్వంలోని ప్రజాప్రయోజన వ్యాజ్యం కమిటీ పిల్‌గా స్వీక రించవచ్చంది. ఈ వ్యవహారంలో న్యాయవాది శేషాద్రి గతంలో రాసిన లేఖను పిల్‌గా పరిగణించి హైకోర్టు విచారణ జరుపుతోందని పేర్కొంది. చంగల్‌రెడ్డి లేఖను ఈ పిల్‌కు జతచేసింది. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, విద్యుత్ సంస్థలను ప్రతివాదులుగా చేర్చింది.