ఆర్టీఏ అధికారుల కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ శనివారం సిద్దిపేటలో స్టీరింగ్ ...
సిద్దిపేట జోన్: ఆర్టీఏ అధికారుల కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ శనివారం సిద్దిపేటలో స్టీరింగ్ ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కొనసాగింది. స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగిం ది. మార్గమధ్యలో రెండు చోట్ల ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన సద్దుమనిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే...
సిద్దిపేట పట్టణానికి సమీపంలోని వివిధ గ్రామాలకు ప్రయాణికులను చేరవేసేందుకు వందలాది స్టీరింగ్ ఆటోలు ఉన్నాయి. ప్రతిరోజూ ఆర్టీఏ అధికారులు పట్టణ సరిహద్దుల్లో చెక్‌పాయింట్లు పెట్టి నిబంధనలు పాటించని వారిపై కేసు నమోదు చేస్తున్నారు. అయితే అన్నీ సక్రమంగా ఉన్నా, చిన్నచిన్న విషయాలకే బారీ మొత్తంలో చలాన్లు రాస్తున్నారంటూ ఆటోడ్రైవర్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వందలాంది మంది ఆటోవాలాలు శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీఏ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఆర్టీఏ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్లను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. తాము ఉద్దేశపూర్వకంగా దాడులు నిర్వహించడం లేదని, నిబంధనల మేరకే జరిమానాలు విధిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం డ్రైవర్లు ఆటోలతో పట్టణంలోర్యాలీ చేపట్టారు. స్థానిక డిపో ఎదుట మరోసారి రాస్తారోకో నిర్వహించారు.
విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ల ఆందోళనను విరమింపజేశారు. అక్కడి నుంచి భారీ ఆటో ర్యాలీ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. నిరసనకు తెలంగాణ దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం సంఘీభావం ప్రకటించారు.