భక్త జనసంద్రమైన భద్రాచలం : ఆర్జిత సేవలు రద్దు
భద్రాచలం : గోదావరి పుష్కరాల ఐదవ రోజు ఖమ్మం జిల్లా భద్రాచలం జనసంద్రమైంది. జిల్లాలో 5 లక్షల మంది పుష్కర స్నానం చేయగా, ఒక్క భద్రాచలంలోనే 4 లక్షల మంది భక్తులు స్నానమాచరించారు. ఈ స్థాయిలో భక్తులు రావటం భద్రాచలం చరిత్రలో ఇదే మొదటిసారి. రద్దీతో ఖమ్మం-భద్రాచలం మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏర్పాట్లను మంత్రులు జగదీష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. డీఐజీ, ఐజీ, ఇంటిలిజెన్స్ ఐజీలు కూడా ఏర్పాట్లను పరిశీలించారు.
ఆర్జిత సేవలు రద్దు :
భద్రాచలంకు శనివారం భక్తులు భారీగా తరలిరావడంతో రామాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. పైగా పత్యేక దర్శనాల పేరుతో ఎటువంటి టికెట్లు విక్రయించడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఊహించని రీతిలో భక్తులు భద్రాద్రికి పోటెత్తడంతో వారందరికీ ఆలయ దర్శనం కల్పించే అవకాశం లేక పోలీసు అధికారుల సూచనలతో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. రాములవారి దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టడంతో కొందరు భక్తులు స్వామిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.
కాగా పుష్కర స్నానాల కోసం భద్రాచలంకు శనివారం పలువురు వీఐపీలు వచ్చారు. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, హైకోర్టు జడ్జి, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, మంత్రి జగదీష్‌రెడ్డి తదితరులు పుణ్య స్నానాలు చేసి స్వామిని దర్శించుకున్నారు.