కృష్ణమ్మ పరవళ్లు | Heavy Water Inflow To Krishna River | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ పరవళ్లు

Published Fri, Sep 27 2019 2:21 AM | Last Updated on Fri, Sep 27 2019 2:21 AM

Heavy Water Inflow To Krishna River - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణా నది ఉగ్రరూపం కొనసాగిస్తోంది. మధ్య మధ్యన కొంత తెరపినిచ్చినా మళ్లీ అదే స్థాయిలో ఉరకలెత్తుతోంది. రెండు నెలల కింద మొదలైన కృష్ణా పరవళ్లు ఏమాత్రం విరామం లేకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, బేసిన్‌ పరిధిలో ఉప్పొంగుతున్న ఉపనదుల కారణంగా గురువారానికి ప్రవాహాలు 1.30 లక్షలకు పుంజుకున్నాయి. దీంతో ఆల్మట్టి మొదలు పులిచింతల ప్రాజెక్టు వరకు అన్ని ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి.

రోజురోజుకూ పుంజుకుంటున్న ప్రవాహాలు..
గత 3, 4 రోజులుగా కృష్ణమ్మ కాస్త శాంతించినట్లు కనబడ్డా మళ్లీ ఉగ్రరూపమెత్తింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం ఆల్మట్టిలోకి 53 వేల క్యూసెక్కుల మేర మాత్రమే ప్రవాహం కొనసాగగా అది గురువారం సాయంత్రానికి మరో 80 వేల క్యూసెక్కుల మేర పెరిగి 1.30 లక్షల క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిస్థాయి మట్టాలకు చేరుకోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఇక నారాయణపూర్‌కు ఈ వరదంతా చేరుతుండటంతో అక్కడి నుంచి 1.68 లక్షల క్యూసెక్కులను దిగువ జూరాలకు వదిలేశారు. జూరాలకు ప్రస్తుతం 1.07 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా శుక్రవారానికి అది మరింత పుంజుకునే అవకాశం ఉంది. మరోపక్క మహారాష్ట్రలోని ఉజ్జయిని నుంచి సైతం 55 వేల క్యూసెక్కులు దిగువకు వదలడంతో ఆ నీరంతా జూరాలకు వచ్చే అవకాశం ఉంది. ఇక తుంగభద్ర నుంచి వస్తున్న ప్రవాహం, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలానికి 1.77 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడి నుంచి విద్యుదుత్పత్తి, గేట్లు ఎత్తడం ద్వారా 2.51 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహాలకుతోడు స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌లోకి 1.90 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టుల పూర్తిస్థాయి మట్టాలకు నిల్వలు చేరడంతో ఇక్కడి నుంచి 1.98 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ఆ నీరంతా పులిచింతల ద్వారా సముద్రంలో కలుస్తోంది. ఇప్పటిదాకా కృష్ణా బేసిన్‌ నుంచి 460 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. 


పదేళ్ల రికార్డులు బధ్దలు...

ఇక కృష్ణా బేసిన్‌లో కొనసాగుతున్న వరద కొత్త రికార్డులు సృష్టించింది. విరామం లేకుండా కొనసాగిన వరద కారణంగా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వచ్చిన వరద పదేళ్ల రికార్డులను చెరిపేసింది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009–10లో గరిష్టంగా 1,218.55 టీఎంసీలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం జలాశయంలోకి 1,220 టీఎంసీల మార్కును దాటింది. గత పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో ప్రస్తుతం కృష్ణా నదికి వరద కొనసాగుతుండటంతో ఇది మరింత పెరగనుంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాలు, తుపానుల కారణంగా కృష్ణా బేసిన్‌లో మరో రెండు నెలలపాటు భారీ వర్షాలకు ఆస్కారం ఉంటుంది. గతంలో ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు కురవకపోయినా అక్టోబర్, నవంబర్‌లలో తుపానుల కారణంగా భారీ వరదలొచ్చాయి. ప్రస్తుత ఏడాదిలోనూ అదేమాదిరి వర్షాలు కురిస్తే శ్రీశైలానికి ఈ ఏడాది వచ్చే నీరు కొత్త రికార్డులు సృష్టించనుంది. ఇక జూరాల ప్రాజెక్టుకు సైతం ఈ ఏడాది ఏకంగా వెయ్యి టీఎంసీలకుపైగా వరద వచ్చింది. 2007–08లో 1,266.58 టీఎంసీల మేర వరద రాగా ఆ తర్వాత ఇప్పుడే 1,053.13 టీఎంసీల మేర వరద వచ్చింది. ఇక సాగర్‌కు సైతం ఎన్నడూ లేని రీతితో ఈ ఏడాది 799 టీఎంసీల మేర నీరు రావడం గమనార్హం.

ఎస్సారెస్పీలోకి భారీ ప్రవాహాలు..
గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహాలు మరింత పుంజుకున్నాయి. గురువారం ఏకంగా 45,990 క్యూసెక్కుల మేర ప్రవాహాలు రావడంతో ప్రాజెక్టు నిల్వ 90 టీఎంసీలకుగాను 60.63 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మరో నాలుగైదు రోజులు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులో నిల్వలు కనిష్టంగా 77 టీఎంసీలకు చేరే అవకాశాలున్నాయి. ఇక ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు, కడెం ప్రాజెక్టుల్లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవాహాలు కొనసాగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement