సాక్షి, సిటీబ్యూరో : వాహనదారుల అతివేగం వల్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) రక్తసిక్తమవుతోంది. నిత్యం జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్ట పడటంలేదు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), సైబరాబాద్, రాచకొండ పోలీసులు తీసుకుంటున్న చర్యలతో ప్రమాదాల తీవ్రత తగ్గినా.. ఆ ఘటన జరిగిన సమయంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణిస్తున్నవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌పై హెల్త్ ఎమర్జెన్సీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని క్షతగాత్రుల ప్రాణాలకు రక్షణగా మారే ‘గోల్డెన్ అవర్’లో ప్రాథమిక ఆరో గ్య సేవలు అందించడంతో పాటు సకాలంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ‘హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసు’లు ఉచితంగా అందిస్తామంటూ నగరానికి చెందిన ట్రూ ఎయిడ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.ఉమేష్ తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో కమిషనర్ టి.చిరంజీవులును కలిసి వివరించారు. ఈ సేవల వల్ల క్షతగాత్రుల ప్రాణాలు కాపాడే అవకాశముంటుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా అది హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
క్షతగాత్రులకు సాంత్వన చేకూరేలా..
158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లో 2015లో 84 ప్రమాదాల్లో 81 మంది, 2016లో 104 దుర్ఘటనల్లో 119 మంది, 2017లో 52 ప్రమాదాల్లో 51మంది మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదాల్లో దాదాపు 20 మంది వరకు మృతి చెందారని పోలీసులు చెబుతున్నారు. అతివేగం, డ్రైవర్ కునుకుపాటు, నిద్ర తదితర కారణాల వల్ల జరిగిన ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని త్వరితగతిన ఆస్పత్రులకు చేరిస్తే ప్రాణాలు నిలిచేవని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రులకు ప్రాణం పోసే ‘గోల్డెన్ అవర్’లో ఆస్పత్రిలో చేర్చేలా పక్కా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌పై సంచరిస్తున్న ఎనిమిది అంబులెన్స్‌లకు తోడు మరిన్ని అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చి ఒక్కో అంబులెన్స్‌ను పది నుంచి 15 కిలోమీటర్ల మధ్య నిలిపేలా ఉంచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన ఫోన్‌కాల్ రాగానే ఆ ప్రాంతానికి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
స్పెషలైజ్డ్ డాక్టర్‌తో హెలికాప్టర్‌లో సేవలు..
గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట (60 నిమిషాల) సమయం. ప్రమాద తీవ్రతను బట్టి గోల్డెన్ అవర్ సమయం మారుతూ ఉంటుంది. ప్రమాదం జరిగి తీవ్రగాయాలైన సమయంలో క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకరాకపోవడంతో అనేక మంది ప్రాణాలు వదులుతున్నారు. అందుకే గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు సకాలంలో ఆస్పత్రికి చేరేలా మేమున్నామంటూ... ‘హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసు’లు అందిస్తామని ట్రూ ఎయిడ్ సంస్థ ముందుకు వచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగిందని ఫోన్‌కాల్ వచ్చిన సెకన్లలోనే ఘటనాస్థలికి సమీపంలో హెలికాప్టర్ వాలిపోతుంది. ఏరోమెడికల్ ఆపరేషన్ వసతులు ఉన్న ఈ హెచ్‌ఈఎంఎస్ హెలికాప్టర్‌లో స్పెషలైజ్డ్ డాక్టర్‌తో పాటు ప్రాథమిక చికిత్స అందించేందుకు పారామెడిక్ టీమ్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఓఆర్‌ఆర్‌కు నాలుగు దిక్కులా శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్, కీసర ప్రాంతాల్లో ఈ సేవలు సత్వరం అందేలా చూడనున్నారు. ఇందుకోసం గచ్చిబౌలిలోని ఇంటర్‌ఛేంజ్ వద్ద దాదాపు ఎకరం స్థలంలో ట్రూఎయిడ్‌కు స్థలం కేటాయించాలని ఆ సంస్థ ఎండీ ఉమేష్ కోరారు. ఇక్కడ హెలికాప్టర్ ల్యాండ్ కాగానే క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని బట్టి మరింత చికిత్స చేసి అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలిస్తామన్నారు. ఒక్కోసారి నేరుగా ఆయా ఆస్పత్రులకు సమీపంలోనే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసి అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తామని వివరించారు. ఇప్పటికే నగరంలోని చాలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని, వారి ప్రాంగణాల్లో రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా చర్యలు కూడా తీసుకుంటున్నారని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ టి.చిరంజీవులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుటామని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment