‘దేవాదాయం’.. ఇక పోలీసు అధీనం!
- ఆలయాల్లో అక్రమాల అడ్డుకట్టకే..
- అర్చకులు, ఉద్యోగుల వేతననిధి ఏర్పాటు
- కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గ ఉపసంఘం
- ఎజెండాపై అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ చర్చ
సాక్షి, హైదరాబాద్: దేవాదాయం.. ఇక పోలీసుల అధీనం కానుంది. దేవాలయాల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా దేవాదాయశాఖను పోలీసు విజిలెన్స్ పరిధిలోకి తెచ్చేదిశగా అడుగులు వేస్తోంది. దేవాదాయ శాఖకు ప్రత్యేక విజిలెన్స్ విభాగమున్నా, సంబంధిత అధికారులు కమిషనర్ కార్యాలయానికే పరిమితం కావటం, నామమాత్రంగా తని ఖీలు జరుపుతూ బాధ్యులపై చర్యలు తీసుకోకపోతుండటంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
స్వామివారి ప్రసాదం సరుకులను, భక్తులిచ్చిన కైంకర్యాలను కూడా స్వాహా చేసేస్తున్నారు. దీంతో పోలీసు విజిలెన్స్ ద్వారా తనిఖీ చేయిస్తేనే పరిస్థితి మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో దీనిపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆక్రమణల తొలగింపునూ పోలీసు పర్యవేక్షణలో చేపట్టేవిధంగా నిబంధనలు మార్చడంపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ ఉప సంఘం భేటీలో చర్చించాల్సిన అంశాలపై దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, ఆర్‌జేసీలు శ్రీనివాసరావు, కృష్ణవేణిలతో చర్చించారు.
వేతన నిధికి రూ.102 కోట్లు అవసరం
ఆలయ ఉద్యోగులు, అర్చకులకు వేతనాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసే కేంద్రనిధికి రూ.102 కోట్లు అవసరమవుతాయన్న అంచనాకు వచ్చి అధికారులు మంత్రి ముందు లెక్కలుంచారు. ఆలయ సిబ్బంది పెంపు తదితర అంశాలనూ ఎజెండాలో ఉంచాలని నిర్ణయించారు.