పేదల కోసం హైఫై టవర్స్ | hifi towers for poor people | Sakshi
Sakshi News home page

పేదల కోసం హైఫై టవర్స్

Published Thu, Dec 10 2015 4:31 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

పేదల కోసం హైఫై టవర్స్ - Sakshi

పేదల కోసం హైఫై టవర్స్

9 అంతస్తుల భవంతులు.. లిఫ్టు, ఫైర్ ఫైటింగ్ ఏర్పాట్లు, సకల సౌకర్యాల కల్పన
 ‘గ్రేటర్’లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కొత్త నమూనా
 24 నియోజకవర్గాల పరిధిలోని ఒక్కో మురికివాడలో నిర్మాణం
 సర్కారుకు జీహెచ్‌ఎంసీ ప్రతిపాదన.. రూ.647.13 కోట్లతో 8,560 ఇళ్లకు అంచనాలు

 సాక్షి, హైదరాబాద్:
డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం.. పేదల్లో సొంతింటి ఆశలను రేకెత్తిస్తోంది. రెండు పడక గదులు, వంట గది, హాల్, రెండు టాయిలెట్లతో ఇంటి నిర్మాణంతో పాటు నీటిసరఫరా, విద్యుత్, అంతర్గత రోడ్లు, మురికి కాల్వలు తదితర కనీస సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పేద కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. కాగా హైదరాబాద్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఒక్కో మురికివాడలో స్టిల్ట్+9 అంతస్తుల నమూనా(సూటబుల్ ప్యాటర్న్)లో నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
 
 ప్రభుత్వ ఆదేశాలతో 8,560 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ.647.13 కోట్ల అంచనాలతో జీహెచ్‌ఎంసీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. వాస్తవానికి డబుల్ బెడ్రూం పథకం కింద రూ.517.88 కోట్ల అంచనా వ్యయంతో నగరంలోని 24 నియోజకవర్గాల్లో 8,560 ఇళ్ల నిర్మాణానికి గత సెప్టెంబర్ 26న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పరిపాలన అనుమతులు(జీవో నం.8) జారీ చేసింది. అయితే నగరంలో స్థలాలు లభించకపోవడంతో ఈ ఉత్తర్వుల మేరకు రెండంతస్తుల(జీ+2) నమూనాలో పేదల ఇళ్ల నిర్మాణం సాధ్యం కావడం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు తేల్చారు. అదే విధంగా చెరువులు, నాలాలు, రైల్వే స్థలాలు, రహదారుల స్థలాలను కబ్జా చేసి నివసిస్తున్న పేదలను ఇతర ప్రాంతాల్లోని మురికివాడల్లో నిర్మించే ఇళ్లకు తరలించాల్సి ఉంది.
 
  ఈ నేపథ్యంలో రెండంతస్తుల సముదాయానికి బదులు లిఫ్ట్, అగ్నిమాపక ఏర్పాట్లతో 9 అంతస్తుల టవర్లను నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తాజాగా జీహెచ్‌ఎంసీ.. ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కింది(స్టిల్ట్) భాగాన్ని వాహనాల పార్కింగ్‌తో పాటు అపార్ట్‌మెంట్ నిర్వహణ ఖర్చులను రాబట్టేందుకు వ్యాపార/వాణిజ్య కార్యక్రమాలకు ఉపయోగించుకోవాల్సి ఉంటుందని సూచించారు. 560 చదరపు అడుగుల స్థలంలో ఒక్కో ఇంటిని నిర్మిస్తారు. ఒక్కో ఇంటికి రూ.5.30 లక్షల వ్యయం చొప్పున 8,560 ఇళ్ల నిర్మాణానికి రూ.453.68 కోట్లు, కనీస సదుపాయాల కల్పనకు రూ.64.20 కోట్లు... మొత్తం రూ.517.88 కోట్లను గతంలో ప్రభుత్వం మంజూరు చేయగా.. తాజాగా సవరించిన నమూనాతో ఇళ్లను నిర్మించడానికి ఒక్కో ఇంటిపై రూ.75 వేలు మాత్రమే అదనంగా వెచ్చించాల్సి రానుంది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే అదనంగా రూ.129.25 కోట్లను మంజూరు చేయాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement