ఎమ్మెల్యేల జోక్యం ఉండరాదు!: కేసీఆర్
* ఎమ్మెల్యేల జోక్యం ఉండరాదు!: కేసీఆర్
* పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం కేసీఆర్ సూచన
* లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఆర్డీవోలకే
* గ్రామాల ఎంపిక వరకే ఎమ్మెల్యేలు పరిమితం
* సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: ‘పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం’ కార్యక్రమాన్ని పూర్తిగా అధికారులకే అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ పథకం విషయంలో ప్రజా ప్రతినిధుల జోక్యం ఉండకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. పేదలకు ఇళ్ల మంజూరీలో స్థానిక నేతల నుంచి ఎమ్మెల్యే వరకు కల్పించుకోవడం బహిరంగ రహస్యమే. వారు చెప్పిన పేర్లతోనే లబ్ధిదారుల జాబితాలు రూపొందించే వ్యవహారం ఇకపై కొనసాగరాదని సీఎం కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే కొత్త రాష్ట్రంలో పేదలకు ఇళ్ల మంజూరు వ్యవహారాన్ని ఎక్కడికక్కడ ఆర్డీవో స్థాయి అధికారికే అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లను నిర్మించినా ఇంకెంతో మంది నిరాశ్రయులు మిగిలే ఉన్నారు.
అలాంటి వారి కోసం ఎంత ఖర్చయినా ఫర్వాలేదంటూ భరోసా ఇచ్చిన కేసీఆర్.. ఇళ్ల నిర్మాణంలో అవినీతికి తావుండరాదని, అవి అనర్హుల చేతిల్లోకి వెళ్లకూడదని పట్టుదలగా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా 125 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు పడక గదులు, హాలు, వంటశాల, స్నానాల గ దులతో కూడిన విశాలమైన ఇళ్లను కట్టించి ఇస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఖజానాపై తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతుల్లోకి వెళ్లొద్దని గృహ నిర్మాణ శాఖను ఆయన తాజాగా ఆదేశించారు. ఇప్పటి వరకు అమలవుతున్న విధానాలన్నింటినీ మార్చాలని కూడా పేర్కొన్నట్టు తెలిసింది. జవాబుదారీతనం ఉండేలా అధికారుల ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక జరగాలని ఆయన భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు కల్పించుకుంటే రాజకీయ జోక్యం పెరిగిందన్న ఆరోపణలు వస్తాయనేది కేసీఆర్ ఉద్దేశం. ఈ క్రమంలోనే లబ్ధిదారులను సిఫారసు చేసే పద్ధతిని పక్కన పెట్టాలని ఎమ్మెల్యేలకూ ఆయన సూచిస్తున్నారు.
అయితే తమ నియోజకవర్గ పరిధిలో ఏయే గ్రామాలకు ఇళ్ల అవసరముందో ఎమ్మెల్యేలు సిఫారసు చేయొచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. అంటే ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించే బాధ్యత అధికారులదేనన్నమాట! అలాగే పేదల కోసం కొత్తగా కట్టే ఇళ్ల సముదాయం పట్టణాల్లో కనిపించే గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఉండాలని కూడా కేసీఆర్ ఇప్పటికే గృహనిర్మాణ శాఖకు సూచించారు. ఆ ఇళ్లు ప్రత్యేకంగా కనిపించాలని, వాటిలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని, దీనికి తగ్గుట్టుగానే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రికార్డు కోసం భారీ సంఖ్యలో ఇళ్లను నిర్మించడం కంటే... మంచి నాణ్యతతో తక్కువ సంఖ్యలో నిర్మించడం మేలని ఆయన హితబోధ చేశారు. దేశంలో ఎక్కడా లేనంత గొప్పగా ఆ ఇళ్లు కనిపించాలని పేర్కొన్నారు.