‘డబుల్’ లేట్!
గూడులేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ నాలుగేళ్లు గడిచినా అమలుకు నోచుకోవడం లేదు. మంజూరైన ఇళ్లలో పది శాతం కూడా నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. దీంతో పేదల సొంతింటి కళ.. కలగానే మిగిలిపోయింది.
నిజామాబాద్‌అర్బన్ : అధికారంలోకి వస్తే పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో తమ సొంతింటి కళ నెరవేరుతుందని పేదలు ఆనందించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ కనీసం పదిశాతం ఇళ్లను కూడా నిర్మించలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో డబుల్‌బెడ్‌రూమ్‌ల లబ్ధిదారులకు కేటాయింపు జరిగినా.. 90 శాతం పనులు ఇప్పటి వరకు పూర్తికాకపోవడంతో అనేక మంది లబ్ధిదారులు ఇళ్లను పొందలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు.
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి
ఉమ్మడి జిల్లాలో 15,533 వేల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 8,375 ఇళ్లను మంజూరు చేయగా, కామారెడ్డి జిల్లాకు 7,158 వేల ఇళ్లను మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ కనీసం 10 శాతం ఇళ్లను సైతం నిర్మించలేకపోయారు. బాన్సువాడ నియోజక వర్గంలో 2,950 ఇళ్లును మంజూరు చేస్తే 2,195 ఇళ్ల నిర్మాణాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వంద ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించారు. జిల్లాలో ఈ ఒక్క చోటనే కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. మంత్రి పోచారం సొంత నియోజకవర్గం కావడంతో ఆయన చొరవ తీసుకుని ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయించి కొందరు లబ్ధిదారులకు కేటాయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా చోట్ల ఆలస్యంగా పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటి వరకు టెండర్లు పూర్తికాకపోవడం గమనార్హం.
నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో 6,454 ఇళ్లను మంజూరు చేశారు. 5,207 ఇళ్లకు టెండర్లు పిలిచారు. ఇందులో 3,765 ఇళ్లకు టెండర్లు పూర్తికాగా 1,442 ఇళ్లకు ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 1,086 ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాద్‌లలో మంజూరైన ఇళ్లలో ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల టెండర్లు కూడా ఖరారు చేయలేదు. ఇళ్ల నిర్మాణాలు మందకొడిగానే కొనసాగుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి మొత్తం 1,150 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన 1,100 ఇళ్లు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 50 ఇళ్లు మంజూరయ్యాయి.
ఆర్‌అండ్‌బీకి సంబంధించి 300 నిర్మాణాలు కొనసాగుతుండగా, పీఆర్‌కు సంబంధించినవి 50 నిర్మాణ దశలో ఉన్నాయి. మిగతా నిర్మాణాలు చేపట్టలేదు. దుబ్బ ప్రాంతంలో నిర్మించనున్న ఇళ్లకు నేల సక్రమంగా లేకపోవడం, తరచూ నీరు రావడంతో నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బోధన్ నియోజక వర్గంలో పీఆర్ ఆధ్వర్యంలో 1,871 ఇళ్లు మంజూరు కాగా 500 మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో 1,622 ఇళ్లకుగాను 210 ఇళ్లు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. 50 ఇళ్లకు ఇంతవరకు టెండర్లు పిలువలేదు. ఆర్మూర్ నియోజక వర్గంలో 1,532 ఇళ్లకుగాను 180 ఇళ్లు మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మరో 865 ఇళ్లకు టెండర్లు పిలిచారు.
ఇంకా 392 ఇళ్లకు ఇంత వరకు టెండర్లు ఖరారు కాలేదు. బాల్కొండ నియోజక వర్గంలో 800 ఇళ్లకుగాను టెండర్లు పూర్తయిన ఒక్కటి కూడా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కామారెడ్డి నియోజకవర్గంలో 1,715 ఇళ్లు మంజూరయితే 1,239 ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 893 ఇళ్లు మంజూరవగా 202 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. జుక్కల్ నియోజక వర్గంలో 1,600 ఇళ్లు మంజూరయితే 160 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ నియోజక వర్గంలో 2,950 ఇళ్లు మంజూరు కాగా.. 2,195 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. వంద ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించారు.
నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో..
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వర్షకాలం మొదలైంది. దీనివల్ల పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు 16 ప్రాంతాల ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకవచ్చేందుకు అనుమతి ఇచ్చారు. కానీ కేవలం ట్రాక్టర్‌ల ద్వారా ఇసుకను తీసుకెళ్లాలన్న నిబంధన ఇబ్బందికరంగా మారిందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ఎక్కువ మొత్తంలో నిర్మాణాలు ఉండడంతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకురావడం ఇబ్బందికరంగా మారిందని, పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని అధికారులు సైతం చెబుతున్నారు. మరో వైపు పనులు దక్కించుకున్న నిర్మాణదారులు పనులు మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు.
పనులు దక్కించుకున్న వారిలో ప్రజాప్రతినిధులకు దగ్గరివారు, సంబంధీకులు ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఇళ్ల నిర్మాణం వారికి గిట్టుబాటు కాకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదు. ఆర్మూర్, బాల్కొండ నియోజక వర్గాల్లో ఇళ్ల నిర్మాణాల పరిస్థితి అధ్వానంగా ఉంది. టెండర్లు సైతం ఖరారు కాలేదు. అయినా చోట కూడా నిర్మాణాలు ప్రారంభంకాలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారే తప్పా పనులు పూర్తి చేసేందుకు పూర్తిస్థాయిలో చొరవతీసుకోవడం లేదని తెలుస్తోంది. పాలకులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పనులను త్వరగా పూర్తిచేయించి ఇళ్లు కేటాయించాలని నిరుపేదలు కోరుతున్నారు.
పనులు కొనసాగుతున్నాయి
జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పనులకు కొన్ని చోట్ల ఆటంకాలు ఏర్పడినా నిర్మాణాలు ఆపకుండా చూస్తున్నాం. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయిస్తాం. ఎలాంటి ఆటంకాలు ఉన్నా సమస్యలను పరిష్కరించి నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం.
– హన్మంత్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ
Comments
Please login to add a commentAdd a comment