సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాలతో దాదాపు 230 కిలోమీటర్ల సుదూర సరిహద్దు ఉన్న జిల్లాకు అదనపు బలగాలు కేటాయించేందుకు అనుమతిచ్చింది. గురువారం హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికలపై జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ నజీమ్, ఉప కమిషనర్ వినోద్‌జట్సి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌లు సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్, ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌లు ఈ సమావేశానికి హాజరుకాగా, శాంతిభద్రతల అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది.
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో మావోల ప్రభావం, ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే ఇబ్బందులపై ఎస్పీతో పాటు కలె క్టర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీంతో ఎన్నికల సమయంలో జిల్లాకు నాలుగు బెటాలియన్ల పారా మిలటరీ బలగాలను పంపేందుకు ఎన్నికల కమిషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతోపాటు అదనంగా గ్రేహౌండ్స్, ఒక హెలికాప్టర్, ఆరు శాటిలైట్ ఫోన్లు కూడా పంపనున్నారు. మన రాష్ట్రంలో ఎన్నికలు జరగకముందే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలున్న నేపథ్యంలో అప్పుడు కూడా జిల్లాకు అదనపు బలగాలను పంపాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేయగా...ఎన్నికల కమిషన్ అనుమతించింది
. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేదని, మారుమూల ప్రాంతాల్లో గుర్తించిన మొత్తం 55 పోలింగ్‌స్టేషన్లకు గాను 34 చోట్ల శాటిలైట్ ఫోన్లు లేదా ఎక్కువ సామర్థ్యం గల, అతి ఎక్కువ సామర్థ్యం గల వైర్‌లెస్ సెట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అందులో భాగంగా ఆరు శాటిలైట్ ఫోన్లు జిల్లాకు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు అంగీకరించారు.
ఈనెల 20లోపు కొత్త ఓటర్ల విచారణ
సమావేశంలో భాగంగా కొత్త ఓట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై చర్చ జరిగింది. చివరిసారి జిల్లాలో మొత్తం 27వేల మంది కొత్త ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరి నివాసానికి సంబంధించిన విచారణను ఈనెల 20లోపు పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్‌కు వివరించినట్టు జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ ‘సాక్షి’కి చెప్పారు. ఈసారి ఎన్నికలలో జిల్లా నుంచి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్న 15వేల మంది ఉద్యోగులకు శిక్షణ త్వరలోనే ఇస్తామని, ఈ శిక్షణ కాలంలోనే పకడ్బందీగా వారికి పోస్టల్‌బ్యాలెట్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
అయితే, సమావేశంలో భాగంగా మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లపై చర్చ జరిగినా ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు కానట్లు సమాచారం. ఇలాఉండగా... ఎన్నికల పరిశీలకులుగా ఇతర రాష్ట్ర కేడర్‌లకు చెందిన ఐఏఎస్ అధికారులు వచ్చే నెల తొమ్మిదిన జిల్లాకు రానున్నారు. ఈసారి పార్లమెంటు స్థానానికి ఒకరు, రెండు అసెంబ్లీ స్థానాలకు ఒకరు చొప్పున పరిశీలకులు రానున్నట్టు సమాచారం.