
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల వివాదాన్ని కారణంగా చూపుతూ స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియను నిలిపేయబోమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పంచాయతీరాజ్ చట్ట సవరణ, తదనుగుణ జీవో 81 చట్టబద్ధతను తేలుస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని, దీనికి అనుగుణంగా జారీ చేసిన జీవో 81ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ, చట్ట సవరణ తీసుకొచ్చిన ప్రభుత్వం, బీసీల రిజర్వేషన్ల విషయంలో స్పష్టతనివ్వలేదని తెలిపారు. చట్టంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం, ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించిన తరువాత మిగిలిన దానిని బీసీలకు ఇస్తున్నారని తెలిపారు. ఎస్‌సీ, ఎస్‌టీల విషయంలో ఒకలా, బీసీల విషయంలో మాత్రం భిన్నమైన వైఖరిని అనుసరిస్తోందన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే 50 శాతం ఇవ్వాల్సి ఉంటుందని, ప్రస్తుతం బీసీలకు 16 శాతం మేర రిజర్వేషన్లు దక్కుతున్నాయని, ఇది అన్యాయమన్నారు.
బీసీల జనాభా లెక్కలు తేల్చిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని ఇదే హైకోర్టు ఆదేశాలిచ్చినా, ప్రభుత్వం వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అలా అయితే మూడు వారాల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిస్తామని తెలిపింది. దీనికి కృష్ణమూర్తి స్పందిస్తూ, అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ధర్మాసనం నోటిఫికేషన్ ఇవ్వకుం డా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. తాము చట్ట సవరణ, జీవో 81 చట్టబద్ధతను తేలుస్తామంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment