
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో బుధవారం (నేడు) నుంచి నుమాయిష్ ఏర్పాటు చేసేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. నుమాయిష్ ఏర్పాటుకు ప్రభుత్వాధికారులు జా రీ చేసిన నిరభ్యంతర (ఎన్వోసీ) పత్రాలు, ఇతర సమాచారంపై సమర్పించిన నివేదికలపై ధర్మాసనం ప్రాథమికంగా సంతృప్తి వ్యక్తంచేసింది. అధికారులు చెప్పినట్లుగా ఏర్పాట్లు ఉన్నాయో లేవో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి నుమాయిష్‌ను సందర్శించి ఈనెల 6లోగా నివేదిక సమర్పించాలని, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారా? అని ప్రశ్నించింది. 150 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వం చెప్పడానికి భిన్నంగా 2,900 స్టాల్స్ పెట్టారని పిటిషనర్ చెప్పడం వంటి అంశాలను నివేదికలో పొందుపర్చాలని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి పొందకుండా నుమాయిష్ ఏర్పాటు చేయడం వల్లే గతంలో అగ్నిప్రమాదం జరిగిందని, ఇందుకు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులను బాధ్యులుగా చేసి వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు ఉత్తర్వులివ్వాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ వాదిస్తూ.. నుమాయిష్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఎలాంటి విపత్తు చోటు చేసుకున్నా నివారణకు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
ఎగ్జిబిషన్ మైదానంలోనే 1.5 లక్షల లీటర్ల నీటి నిల్వ చేసేలా 2 సంపులు ఏర్పాటు చేశామని, విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగితే 8 సెకన్ల లోపే ప్రారంభమయ్యే జనరేట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, కేసు విచారణ అయ్యే వరకూ నుమాయిష్‌కు అనుమతి ఇవ్వరాదని పిటిషనర్ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. అలాగే నుమాయిష్‌కు ఉన్న 9 గేట్లలో మూడింటిని తెరిచి ఉంచాలని, మిగిలిన గేట్లకు కూడా తాళాలు వేయకుండా శిక్షణలో తర్ఫీదు పొందిన వ్యక్తులను గేట్ల వద్ద కాపలా పెట్టాలని ఎగ్జిబిషన్ సొసైటీని ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment