సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జరిమానా, మరో అధికారికి జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణభాస్కర్ (ప్రస్తుతం సిరి సిల్ల జిల్లా కలెక్టర్)లకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే నెల రోజులు జైలు శిక్ష అనుభవించాలంది. కాళేశ్వరం ప్రాజెక్టు యూనిట్–3 భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (సిద్దిపేట ఆర్డీవో) జయచంద్రారెడ్డికి 2 నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించకుంటే నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. ముగ్గురు అధికారులు రూ.2 వేలు చొప్పున పిటిషనర్లకు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు 2 వేర్వేరు కోర్టు ధిక్కార కేసుల్లో న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ నెల 24న తీర్పు చెప్పారు. అప్పీల్‌కు వీలుగా తీర్పు అమలును 4 వారాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.
తిరిగి నోటిఫికేషన్..
ఈ తీర్పు ప్రతి అందిన 6 మాసాల్లోగా గతంలోని కోర్టు ఉత్తర్వుల మేరకు భూసేకరణకు తిరిగి డిక్లరేషన్, అవార్డు వంటి సెక్షన్ 11 (1) ప్రకారం చెల్లదని, వాటితో పాటు ఫాం–సీ ప్రొసీడింగ్, నోటిఫికేషన్లను తిరిగి జారీచేయాలని, భూసేకరణ చట్టం–2013 ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కింది స్థాయిలో అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడానికి ఆ ముగ్గురు ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని, ఉద్దేశపూర్వకంగానే ఆదేశాల్ని ఉల్లంఘించారని తప్పుపట్టింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ విషయంలో హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయలేదని గాండ్ల లక్ష్మి, రాం రెడ్డి ఇతరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కారం వ్యాజ్యాలపై న్యాయమూర్తి 16 పేజీల తీర్పు చెప్పారు. ‘సిద్దిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్‌కు చెందిన రైతుల అభ్యంతరాలను పరిష్కరించాకే మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు, భూముల కోసం అవార్డు ప్రకటించాలి. పిటిషనర్ల అభ్యంతరాలు పరిష్కరించకుండా భూముల విషయంలో ముందుకు వెళ్లరాదు. ప్రాజెక్టుకు చెందిన పూర్తి వివరాలు, మ్యాప్, తెలుగు డీపీఆర్ ప్రతులు రైతులకివ్వాలి’అని గత ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హైకోర్టు తాజా తీర్పులో పేర్కొంది.
భూముల స్వాధీనం చెల్లదు..
2018లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ భూసేకరణకు సంబంధించి రైతుల అభ్యంతరాలు వినకుండా డిక్లరేషన్‌ను ఇచ్చారనే పిటిషనర్ల వాదనను హైకోర్టు ఆమోదించింది. భూసేకరణ చట్టం– 2013కు వ్యతిరేకంగా అధికారులు వారి భూముల్ని స్వాధీనం చేసుకోవడం చెల్లదని తేల్చింది. హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయనప్పుడు వాటిని పొడిగించాలనీ అధికారులు హైకోర్టును కోరలేదని తప్పుపట్టింది. ఆ చట్టంలోని సెక్షన్ 13 నిబంధనకు వ్యతిరేకంగా అధికారుల చర్యలున్నాయని పేర్కొంది. అదే చట్టంలోని సెక్షన్ 19 (1) కింది భూమి కోసం డిక్లరేషన్, ఎంక్వయిరీ నోటీసు, భూసేకరణ నోటిఫికేషన్, ఆ తర్వాత భూసేకరణ చేయాలనే నిబంధనను అధికారులు అమలు చేయలేదని స్పష్టంచేసింది. తొలుత ఆర్డీవోగా ఉన్న ముత్యంరెడ్డి రైతుల అభ్యంతరాలు స్వీకరించారని, అయితే ఆయన తర్వాత ఆర్డీవోగా వచ్చిన జయచంద్రారెడ్డి నాలుగు వారాల్లో చేయాల్సిన పనులకు 8 వారాలు తీసుకున్నారని, అయినా అభ్యంతరాలపై విచారణ పూర్తి కాలేదని కోర్టు పేర్కొంది.
రైతుల వినతిపత్రాలపై ఆర్డీవో ఏవిధమైన సమాచారం ఇవ్వలేదు కాబట్టి రైతుల వినతిని ఆమోదించినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఈ కేసులో జిల్లా కలెక్టర్ స్వయంగా గతంలో హైకోర్టు విచారణకు కూడా హాజరయ్యారని, అయినా తామిచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయకుండానే ప్రాజెక్టు పనుల పేరుతో భూమిని స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. గతంలోని తీర్పును అమలు చేయకపోవడానికి చెప్పిన కారణాలు సహేతుకంగా కూడా లేవని, కావాలనే ఉత్తర్వుల్ని అమలు చేయలేదని తీర్పులో స్పష్టంచేసింది. భూసేకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగా భూనిర్వాసితులకు న్యాయపరంగా పరిహారం చెల్లించిన తర్వాతే భూసేకరణ చేయాలని కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment