ప్రభాస్ పిటిషన్‌పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు | High Court Interesting Comments on Prabhas Petition | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 3 2019 4:11 PM | Last Updated on Thu, Jan 3 2019 4:17 PM

High Court Interesting Comments on Prabhas Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూవివాదానికి సంబంధించి ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు  చేసింది. రీల్ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి.. రియల్ లైఫ్‌లో విలన్లతో తలపడి ఉండరంటూ న్యాయస్థానం పేర్కొంది.  సామాన్యుడి విషయంలో అయితే గతంలోనే తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్ళమని, కానీ,  ప్రభాస్ విషయంలో ఆచితూచి వ్యవహరించామని హైకోర్టు పేర్కొంది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభాస్ భూకబ్జాదారుడని ఆరోపించగా.. ఆ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. భూకబ్జాదారుడైనప్పటికీ అతనికి సెక్షన్ 17 కింద నోటీసులు ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభాస్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఆ భూమిని కబ్జా చేసిన మిగతావాళ్ళు కూడా.. ఇందుకు అర్హులవుతారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, ప్రభాస్ తరఫు వాదనలు వినిపిస్తూ.. తాను కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్‌ గెస్ట్ హౌజ్‌ కట్టుకున్నారని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

కేసు పూర్వాపరాలు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్‌ 5/3లో ప్రభాస్‌కు చెందిన 2,083 చదరపు అడగుల స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో తమ కౌంటర్‌లో రెవెన్యూ అధికారులు ఇప్పటికే హైకోర్టు వివరించారు. తన స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్‌ గత బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు.

వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్‌ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement