
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్న గుత్తి కోయలు తెలంగాణకు వస్తే వారిని ఎస్టీలుగా ఎందుకు పరిగణించడం లేదో తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలకు వలస వచ్చిన గుత్తి కోయల హక్కులు హరిస్తున్నాయని పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా పరిగణించింది. ఈ పిల్‌ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారించి ప్రతివాదులైన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ/అటవీ శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.