హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో నిర్మించతలపెట్టిన బంజారాభవన్, కొమురం భీం భవనాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్‌కో) కొనసాగించాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ప్రభుత్వ భూమిలో బంజారా భవన్, కొమురం భీం భవనాల నిర్మాణం కోసం భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవోలు జారీ చేసింది.
వీటిని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన రమేష్ పరశురాం మలానీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఆయా భవనాల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమి ఎవాక్యూ ప్రాపర్టీ అని, దానిని నిర్దేశిత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని పిటిషనర్ పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులిచ్చింది.