‘మైనారిటీ కమిషన్’పై కౌంటర్ దాఖలు చేయండి
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మైనారిటీ కమిషన్ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్త మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేయకపోగా, ఇప్పటికే ఉన్న కమిషన్‌ను కొనసాగనివ్వడం లేదంటూ కమిషన్ ప్రస్తుత చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత కమిషన్ నిర్వహణకు అవసరమైన ఖర్చులను, సిబ్బంది జీతభత్యాలను చెల్లించడం లేదని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.