Minority Commission
-
రెండేళ్లు పూర్తిచేసుకున్న మైనార్టీ కమిషన్
సాక్షి సిటీబ్యూరో: మైనార్టీ సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మైనార్టీల సమగ్రాభివృద్ధి, ఆయా రంగాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మహ్మద్ ఖమురుద్దీన్ నేతృత్వంలో 2018లో ప్రభుత్వం మైనార్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో మైనార్టీలు తమకు జరగాల్సిన న్యాయం కోసం కమిషన్‌ను సంప్రదిస్తున్నారు. చైర్మన్‌గా ప్రతినెలా క్రమం తప్పకుండా సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తూ, విచారణలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కమిషన్ చైర్మన్ ఖమురుద్దీన్ ‘సాక్షి’కి వివరించారు. ఇప్పటివరకు 966 కేసులు వివిధ ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేట్ సంస్థలపై నమోదు అయ్యాయని, ఇందులో 802 కేసులు పరిష్కరించిన్నట్లు తెలిపారు. రెండో అధికార భాషగా ఉర్దూ అమలుకు కమిషన్ కృషి చేసింది. అంబేద్కర్ వర్సిటీలో ఉర్దూ భాషలో గ్రాడ్యుయేషన్ కోర్సులను అమలుచేసేలా చర్యలు తీసుకుంది. ప్రెస్ అకాడమీ లోగోలో ఉర్దూ భాషను చేర్పడం మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. 4 శాతం రిజర్వేషన్ అమలుపై దృష్టి సారించి, ఆయా శాఖల్లో మైనార్టీలకు కేటాయించిన ఖాళీ పోస్టుల వివరాలు తెలుసుకొని వాటిని భర్తీకి చర్యలు తీసుకుంది. -
జేఎన్యూకు మైనారిటీ కమిషన్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లామిక్ ఉగ్రవాదంపై కోర్సు ప్రారంభించాలనే ప్రతిపాదనకు సహేతుక కారణం వెల్లడించాలని కోరుతూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రిజిస్ర్టార్‌కు ఢిల్లీ మైనారిటీ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ప్రతిపాదిత కోర్సుపై వచ్చిన వార్తలపై సుమోటోగా మైనారిటీ కమిషన్ స్పందిస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఏ ప్రాతిపదికన యూనివర్సిటీ కోర్సు ప్రారంభిస్తుందో వివరణ ఇవ్వాలని రిజిస్ర్టార్‌కు ఇచ్చిన నోటీసులో కమిషన్ పేర్కొంది. జేఎన్యూకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కమిషన్ ఛైర్మన్ జఫరుల్ ఇస్లాం ఖాన్ నిర్ధారించారు. కాగా సెంటర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్‌ను ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణలో ఇస్లామిక్ ఉగ్రవాదంపై కోర్సును ప్రారంభించాలని జేఎన్‌యూ అకడమిక్ కౌన్సిల్ ప్రతిపాదనను ఆమోదించింది. గత వారం వర్సిటీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సమావేశానికి హాజరైన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. అయితే ఈ కౌన్సిల్ భేటీలో ఇస్లామిక్ ఉగ్రవాదం కోర్సును చేర్చేందుకు ఏదైనా సిద్ధాంత పత్రం, నిర్థిష్ట ప్రతిపాదన ముందుకొస్తే వాటి నకలును సమర్పించాలని జేఎన్‌యూను మైనారిటీ కమిషన్ కోరింది. కోర్సుకు సంబంధించిన సమగ్ర వివరాలను, కౌన్సిల్ భేటీ అజెండాను, హాజరైన సభ్యుల వివరాలను తెలపాలని కోరింది. -
మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా కమరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మహమ్మద్ కమరుద్దీన్‌ను కమిషన్ చైర్మన్‌గా, రాజారపు ప్రతాప్‌ను వైస్ చైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా మహ్మద్ అర్షద్ అలీఖాన్, విద్యా స్రవంతి, గస్టీ నోరియా, బొమ్మల కట్టయ్య, సురేందర్ సింగ్ నియమితులయ్యారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. చైర్మన్‌తో పాటు సభ్యుల పదవీ కాలం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
‘మైనారిటీ కమిషన్’పై కౌంటర్ దాఖలు చేయండి
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మైనారిటీ కమిషన్ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్త మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేయకపోగా, ఇప్పటికే ఉన్న కమిషన్‌ను కొనసాగనివ్వడం లేదంటూ కమిషన్ ప్రస్తుత చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత కమిషన్ నిర్వహణకు అవసరమైన ఖర్చులను, సిబ్బంది జీతభత్యాలను చెల్లించడం లేదని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
రికార్డులన్నింటినీ భద్రపరచండి
మైనారిటీ కమిషన్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మైనారిటీ కమిషన్ రికార్డులన్నింటినీ భద్రపరచాలని కమిషన్ కార్యదర్శిని బుధవారం ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న మైనారిటీ కమిషన్ గురించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని, ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిం చడం లేదని కమిషన్ చైర్మన్ హైకోర్టును ఆశ్రరుుంచారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. కమిషన్ చైర్మన్, సభ్యుల మూడేళ్ల పదవీ కాలం ఈ ఏడాది మే తో ముగిసిందని తెలిపారు. అందువల్ల కమిషన్ బాధ్యతలను చూసుకునేందుకు కార్యదర్శిని ఏర్పాటు చేశామన్నారు. రికార్డులను కార్యదర్శికి అప్పగించడం సబబుగా ఉంటుందని, ఈ మేరకు పిటిషనర్‌ను ఆదేశించాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం రికా ర్డులన్నింటినీ భద్రపరచాలని కార్యదర్శిని ఆదేశించింది. కమిషన్ కొనసాగింపు విషయంలో మరో వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. -
మెనార్టీస్ కమిషన్‌కు రూ.1.37 కోట్ల నిధులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మైనార్టీస్ కమిషన్‌కు 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1.37 కోట్ల నిధులు కేటాయించినట్లు కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రూ.70.39 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.67.08 లక్షలు తమ బడ్జెట్లో కేటాయించాయన్నారు. ఈ నిధులతో కమిషన్ కార్యకలాపాల నిర్వహణకు వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు. త్వరలో కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిల్లో మైనార్టీ సమస్యలపై సెమినార్లు, సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాకు ఒకరి చొప్పున సమన్వయకర్తల నియామకం చేపట్టనున్నట్లు చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ వివరించారు. -
మైనార్టీ కమిషన్‌కు రూ.1.37 కోట్ల నిధులు
హైదరాబాద్ సిటీ: రాష్ట్ర మైనార్టీస్ కమిషన్‌కు 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.37 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందని కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.70.39 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.67.08 లక్షలు బడ్జెట్లో కేటాయించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రాలు కేటాయించిన నిధులతో కమిషన్ కార్యాకలాపాలు నిర్వహణకు వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు.