
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలు (టీఆర్‌టీ) నిలుపుదల ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. నిరుద్యోగులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న తరుణంలో టీఆర్‌టీ నోటిఫికేషన్ వెలువడిందని.. ఈ దశలో నిలుపుదల చేయడం సముచితం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. నేడు (శనివారం) టీఆర్‌టీ పరీక్ష జరుగనుందని, చివరి క్షణాల్లో అత్యవసరంగా వచ్చి పరీక్షలు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వమని కోరడం సమర్థనీయం కాదని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు తేల్చి చెప్పారు.
పరీక్షలు నిలుపుదల చేయాలని మధ్యంతర ఆదేశాలిస్తే అభ్యర్థుల మానసికంగా ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఒక దశలో వ్యాజ్యాన్ని కొట్టేయడానికి న్యాయమూర్తి సిద్ధపడ్డారు. వ్యాజ్యాన్ని తోసిపుచ్చమంటారా లేక మీరే వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటారా అని పిటిషనర్‌ను నిలదీశారు. దీంతో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో అందుకు న్యాయమూర్తి అనుమతించారు. ఆన్‌లైన్‌లో టీఆర్‌టీ పరీక్షలు నిర్వహించబోతున్నారని, దీనికి బదులు రాత పరీక్ష నిర్వహించాలని కోరుతూ నల్లగొండ జిల్లా వాసి డి.సతీశ్‌రావు సహా నలుగురు హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ముందే వెల్లడి..
టీఆర్‌టీ పరీక్షలను వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజశ్రీ వాదించారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థి రాసే జవాబు తప్పుఒప్పుల్ని తెలుసుకునే వీలుండదన్నారు. మూడు లక్షల మంది అభ్యర్థులు టీఆర్‌టీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, మరో రోజు వ్యవధి ఉండగా పరీక్షల్ని వాయిదా వేయాలని కోరడం సరికాదని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి ప్రతివాదన చేశారు. టీఆర్‌టీ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించినట్లు వెల్లడించారు. లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల భవితవ్యంతో ముడిపడిన టీఆర్‌టీ పరీక్షల్ని వాయిదా వేయవద్దని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం టీఆర్‌టీ పరీక్షల నిలిపివేసేందుకు నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment