TRT Examinations
-
టీఆర్టీపై తర్జనభర్జన!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) వాయిదా వేయక తప్పేట్టు లేదని అధికార వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటమే దీనికి కారణమని పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకూ టీఆర్టీ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఆరు రోజుల పాటు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగు తోంది. ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పరీక్ష నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. పరీక్ష నిర్వహణ కష్టమేనా? రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. వచ్చే నెల 30న ఎన్నికలుండటంతో 15 రోజుల ముందు నుంచే పోలింగ్ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తారు. అప్పటికి ఎన్నికల ప్రచారం హోరాహోరీ దశకు చేరుతుంది. దాదాపుగా ఇదే సమయంలో నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్లు, 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, 24న భాషా పండితులు, 25 నుంచి 30వ తేదీ వరకూ సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులకు సంబంధించిన టీఆర్టీ జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో పోలింగ్ జరిగే 30వ తేదీ పరీక్షను వాయిదా వేస్తే సరిపోతుందని అధికారులు భావించినా, 20వ తేదీ నుంచే ఎన్నికల హడావుడి ఉంటుందని, అభ్యర్థులు కూడా ఓటు వేసేందుకు తమ ఊళ్ళకు వెళ్ళాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు భద్రతతో పాటు ఇతర శాంతిభద్రతల అంశాన్నీ, ఆంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని పలువురు విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదీగాక ఎన్నికల విధులకు వెళ్ళేందుకు టీచర్లు, ఇతర సిబ్బంది సన్నాహాల్లో ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పరీక్ష నిర్వహణ కష్టమని అధికార వర్గాలూ భావిస్తున్నాయి. దీంతో మొత్తంగా పరీక్షనే వాయిదా వేయడమా? ఎస్జీటీ పరీక్ష జరిగే 25 నుంచి 30వ తేదీల్లో మార్పు తేవడమా? అనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించి, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఒకటీ రెండురోజుల్లో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే వీలుందని అన్నారు. నెల రోజులు వాయిదా వేయండి ఎన్నికల హడావుడిలో టీఆర్టీ పరీక్ష నిర్వహణకు ఇబ్బందు లెదురయ్యే అవకాశం ఉంది. నవంబర్ 20 నుండి 30 వరకు జరగబోయే ఈ పరీక్షలన్నీ నెల రోజులు వాయిదా వేయాలి. పరీక్ష దరఖాస్తు తేదీని కూడా పొడిగించాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
దాని కోసమే పార్టీలు మారుతున్నారు: మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: దేశ చరిత్రలోనే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది టీఆర్ఎస్ మాత్రమేనని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 8792 మంది టీఆర్టీ ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి కుటుంబాలు మనోవేదనకు గురు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దీనికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వంశీ.. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికి పైగా నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాల నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు. రేపు జరిగే కేబినెట్ మీటింగ్‌లో అయినా, టీఆర్టీ ఉత్తీర్ణులైన నిరుద్యోగుల ఉద్యోగాల గురించి ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే 8792 మంది కుటుంబ సభ్యులతో సహా మరోసారి ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఎంతోమంది యువత తమ ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధిస్తే, నేడు రాష్ట్రం ఏర్పడినా.. ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15620 పోస్టులకు ఖాళీలు ఏర్పడితే.. ప్రభుత్వం కేవలం 7వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదని, వారి స్వలాభం కోసం ప్రకటనలు చేస్తూ పార్టీలు మారతున్నారని స్పష్టం చేశారు. -
మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య
మిరుదొడ్డి(దుబ్బాక): తీవ్ర మనస్తాపానికి గురై వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని తొగుట మండలం గుడికందుల గ్రామంలో జరిగినట్లు ఎస్ఐ విజయ్‌భాస్కర్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం... గుడికందుల గ్రామానికి చెందిన సూకూరి నర్సింహులుతో తొగుట మండల కేంద్రానికి చెందిన కవిత(వర్షిత)(24)కు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా ఇటీవల కవిత టీఆర్టీ పరీక్ష రాసింది. పరీక్షా ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. మనస్తాపానికి గురైన కవిత బుధవారం ఇంట్లో ఎవరులేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి రాస కనకవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నేడు వెబ్సైట్లో టీఆర్టీ ప్రాథమిక కీలు
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల నిర్వహించిన టీఆర్టీ పరీక్షల ప్రాథమిక కీలను tspsc.gov.in వెబ్సైట్లో బుధవారం నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల కీలపై ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 31 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలను స్వీకరించమని స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ‘టెక్స్ట్ బాక్స్ ఆఫ్ సబ్మిట్ ఆబ్జెక్షన్స్’లింకు ద్వారా పంపించాలని తెలిపింది. టెక్స్ట్ బాక్సులో ఇంగ్లిష్‌లో మాత్రమే టైప్ చేయాలని సూచించింది. ఇతర భాషల్లో తమ అభ్యంతరాలను తెలియజేయాలనుకునే వారు పీడీఎఫ్ రూపంలో ఫైల్ అటాచ్ లింకు ద్వారా పంపించాలని సూచించింది. అందులో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పేపరు కోడ్, సిరీస్, ప్రశ్న నంబర్/ప్రశ్న ఐడీ ఉండేలా చూడాలని పేర్కొంది. -
‘టీఆర్టీ’ని నిలిపివేయలేం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలు (టీఆర్టీ) నిలుపుదల ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. నిరుద్యోగులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న తరుణంలో టీఆర్టీ నోటిఫికేషన్ వెలువడిందని.. ఈ దశలో నిలుపుదల చేయడం సముచితం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. నేడు (శనివారం) టీఆర్టీ పరీక్ష జరుగనుందని, చివరి క్షణాల్లో అత్యవసరంగా వచ్చి పరీక్షలు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వమని కోరడం సమర్థనీయం కాదని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు తేల్చి చెప్పారు. పరీక్షలు నిలుపుదల చేయాలని మధ్యంతర ఆదేశాలిస్తే అభ్యర్థుల మానసికంగా ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఒక దశలో వ్యాజ్యాన్ని కొట్టేయడానికి న్యాయమూర్తి సిద్ధపడ్డారు. వ్యాజ్యాన్ని తోసిపుచ్చమంటారా లేక మీరే వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటారా అని పిటిషనర్‌ను నిలదీశారు. దీంతో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో అందుకు న్యాయమూర్తి అనుమతించారు. ఆన్లైన్లో టీఆర్టీ పరీక్షలు నిర్వహించబోతున్నారని, దీనికి బదులు రాత పరీక్ష నిర్వహించాలని కోరుతూ నల్లగొండ జిల్లా వాసి డి.సతీశ్‌రావు సహా నలుగురు హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆన్లైన్లో నిర్వహిస్తామని ముందే వెల్లడి.. టీఆర్టీ పరీక్షలను వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజశ్రీ వాదించారు. ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థి రాసే జవాబు తప్పుఒప్పుల్ని తెలుసుకునే వీలుండదన్నారు. మూడు లక్షల మంది అభ్యర్థులు టీఆర్టీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, మరో రోజు వ్యవధి ఉండగా పరీక్షల్ని వాయిదా వేయాలని కోరడం సరికాదని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి ప్రతివాదన చేశారు. టీఆర్టీ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించినట్లు వెల్లడించారు. లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల భవితవ్యంతో ముడిపడిన టీఆర్టీ పరీక్షల్ని వాయిదా వేయవద్దని కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం టీఆర్టీ పరీక్షల నిలిపివేసేందుకు నిరాకరించింది. -
నేటి నుంచి టీఆర్టీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శనివారం నుంచి మార్చి 4వ తేదీ దాకా జరగనున్న పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,77,518 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం పదింటికి మొదలయ్యే పరీక్షలకు 9:15కల్లా, మధ్యాహ్నం 2:30 పరీక్షలకు 1:45కల్లా అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ‘‘హాల్‌టికెట్‌తో పాటు ఏదో ఒక ఒరిజినల్ ఐడీ కార్డు విధిగా వెంట తీసుకెళ్లాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ, అభరణాలూ తేవొద్దు. పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి’’ అని పేర్కొంది. తొలిరోజు శనివారం ఉదయం లాంగ్వేజ్ పండిట్ తెలుగు, మధాహ్నం స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షలుంటాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోనే అత్యధిక పోటీ స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు తక్కువున్నా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో వీటికి అధిక పోటీ నెలకొంది. 1,941 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 1,44,906 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులు తక్కువగా ఉండటంతో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు మాత్రం పోటీ తక్కువే ఉంది. ఒక్కో పోస్టుకు 16.49 మంది పోటీ పడుతున్నారు. పోస్టుల్లో 80 శాతం జిల్లా స్థాయి లోకల్ పోస్టులే కావడంతో ప్రధాన పోటీ జిల్లా పరిధిలోనే ఉండనుంది. మిగతా 20 శాతం ఓపెన్ పోస్టుల్లో అన్ని జిల్లాల వారూ పోటీలో ఉంటారు. ఉపాధ్యాయ పోస్టులకు అత్యధిక పోటీ మహబూబ్‌నగర్‌లోనే నెలకొంది. జిల్లాలో 1,979 పోస్టులకు 42,529 మంది పోటీ పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) మినహా మిగతా అన్ని కేటగిరీల్లోనూ మహబూబ్‌నగర్‌లోనే అత్యధిక పోటీ నెలకొంది. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో నల్లగొండలో, ఎస్జీటీ పోస్టుల్లో మెదక్‌లో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 19,396 మంది, ఆ తర్వాత నల్లగొండలో 18,798 మంది పోటీ పడుతున్నారు. ఎస్జీటీ పోస్టులకు మహబూబ్‌నగర్‌లో 17,639 మంది, ఆ తర్వాత మెదక్‌లో 11,173 మంది పోటీ పడుతున్నారు. ఓపెన్ కోటాకు అన్ని జిల్లాల్లో పోటీ కొన్ని జిలాల్లో కొన్ని కేటగిరీలో పోస్టులు లేవన్న ఆందోళన ఈసారి అభ్యర్థులకు అవసరం లేదు. ఇతర జిల్లాలోని ఓపెన్ కోటా పోస్టు కోసం సొంత జిల్లాను వదిలి, ఇతర జిల్లాకు వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అభ్యర్థులిచ్చే జిల్లా ప్రాధాన్యాల ఆప్షన్ ప్రకారం ఆయా జిల్లాల్లోని ఓపెన్ కోటా పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులూ పోటీలో ఉండేలా ఏర్పాటు చేశారు. -
‘టీఆర్టీ’ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన ‘టీచర్ రిక్రూట్మెంట్ (టీఆర్టీ)’ పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. ఏ తేదీన, ఏ సమయంలో ఏయే పరీక్షలు నిర్వహిస్తారు, పరీక్షా కేంద్రాలు తదితర పూర్తి వివరాలను బుధవారం ప్రకటించింది. గురుకుల పోస్టులకు ఈ నెల (ఫిబ్రవరి) 19వ తేదీ నుంచి, ఉపాధ్యాయ పోస్టులకు 24వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ గతంలోనే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయా పోస్టులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య మేరకు పరీక్ష కేంద్రాలు, పరీక్ష విధానాన్ని నిర్ణయించి.. తదనుగుణంగా పూర్తి వివరాలను బుధవారం వెల్లడించింది. గురుకుల పోస్టులకు పూర్తిగా ఆన్లైన్లో ‘కంప్యూటర్ ఆధారిత భర్తీ పరీక్ష (సీబీఆర్టీ)’ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయ పోస్టుల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పోస్టులు, బయాలజీ, మ్యాథ్స్, సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఓఎంఆర్ విధానంలో... మిగతా వాటికి సీబీఆర్టీ విధానంలో పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఇక లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్–తెలుగు, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్–బయాలజీ, మేథ్స్ అండ్ సోషల్ స్టడీస్ (తెలుగు మీడియం) పరీక్షలు మినహా మిగతా అన్ని పరీక్షలను కేవలం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. గురుకుల పరీక్షల షెడ్యూల్ ఇదీ.. – విద్యాశాఖ గురుకులాల్లోని జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఫిబ్రవరి 19న రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం పేపర్–1 (పెడగాజీ), మధ్యాహ్నం పేపర్–2 (సంబంధిత సబ్జెక్టు) ఉంటాయి. – డిగ్రీ లెక్చరర్ పోస్టులకు 20వ తేదీన ఉదయం పరీక్ష నిర్వహిస్తారు. – డిగ్రీ కాలేజీల లైబ్రేరియన్ పోస్టులకు 20న మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది. – గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు 21న ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు నిర్వహిస్తారు. – జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్ పోస్టులకు 22న ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు ఉంటాయి. – జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 23న ఉదయం, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 23వ తేదీన మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయి. -
ప్రశాంతంగా టెట్
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు సంబంధించిన రెండు పే పర్లకు కలిపి 90.5 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 11 కేంద్రాల్లో జరిగిన పేపర్-1 పరీక్షకు 2,815 మందికిగాను 93.9 శాతంతో 2,645 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 52 కేంద్రాల్లో జరిగిన పేపర్-2 పరీక్షకు 11,239 మందిలో 87 శాతంతో 9,783 మంది మాత్రమే హాజరయ్యారని డీఈఓ జి.కృష్ణా రావు ‘న్యూస్‌లైన్’కి తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు.