సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక జైళ్లలో 2012 నుంచి 2015 మధ్య కాలంలో అసహజ మరణానికి గురైన ఖైదీల కుటుంబ సభ్యులను గుర్తించి, వారికి పరిహారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్పందించింది. ఉభయ రాష్ట్రాల్లోని జైళ్లలో నెలకొని ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు, అసహజ మరణానికి గురైన వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు హైకోర్టు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది.
ఇందులో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు, జైళ్ల శాఖ డీజీలతో పాటు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) డైరెక్టర్‌లను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిల్‌పై శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. జైళ్లలో అమానవీయ పరిస్థితులు, అసహజ మరణాలకు గురైన వారి కుటుంబ సభ్యులను గుర్తించి పరిహారం చెల్లించేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను తెలపాలని ఉభయ రాష్ట్ర ప్రభు త్వాలను హైకోర్టు కోరనుంది.
జైళ్లలో దుర్భర పరిస్థితులపై 2013లో దాఖలైన పిల్‌ను ఇటీవల విచారించిన సుప్రీంకోర్టు, 2012–15 మధ్య కాలంలో జైళ్లలో పెద్ద ఎత్తున అసహజ మరణాలు చోటు చేసుకుంటున్నాయన్న ఎన్‌సీఆర్‌బీ గణాంకాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా అసహజ మరణం చెందిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం పొందే హక్కు ఉందని తెలిపింది. ఇలాంటి వారిని గుర్తించి పరిహారాన్ని అందించాలని, అందుకు ఈ వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా పరిగణించాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కోరింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ నుంచి తీర్పు కాపీ అందుకున్న హైకోర్టు ఈ మేర చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా సుమోటో పిల్‌గా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment