నకిరేకల్ మున్సిపాలిటీని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చి ఏడాది గడిచింది. తదనంతరం విలీన గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ప్రభుత్వానికి నేటికీ ఆ ఆలోచనే రావడం లేదు. ప్రత్యేక పాలనలో అభివృద్ధి పనులు ముందుకు సాగక, సమస్యలు తీర్చేవారు లేక ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను.. పట్టించుకునే నాథుడే లేడు. ప్రజాప్రతినిధుల పాలనలో తప్ప.. ‘ప్రత్యేక’ పాలనలో సమస్యలకు మోక్షం లభించదని, తక్షణమే విలీన గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
నకిరేకల్ మండలంలో ఏడు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. మండలంలో అంతటా ప్రజాప్రతినిధుల పాలన కొనసాగుతుండగా ఈ ఏడు గ్రామ పంచాయతీల్లో మాత్రం ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. వెరసి ప్రభుత్వం నుంచి వచ్చే కోట్లాది రూపాయాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నకిరేకల్ మున్సిపాలిటీ రద్దు నేపథ్యంలో తిరిగి విలీన గ్రామాల్లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ఆయా గ్రామాల మదిని తొలుస్తున్న ప్రశ్న.
మున్సిపాలిటీ ఏర్పాటు, రద్దు ఇలా..
నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో మున్సిపాలిటీగా మార్చింది. మండలంలోని చందుపట్ల, నోముల, కడపర్తి, చందంపల్లి, నెల్లిబండ, తాటికల్ గ్రామాలను నకిరేకల్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ నాడు నిర్ణయం తీసుకున్నారు. కాగా గ్రామాల విలీనం నిబంధనలకు విరుద్ధంగా ఉందని గ్రామ పంచాయతీల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించగా 2013 సెప్టెంబర్ మున్సిపాలిటీని రద్దు చేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. నకిరేకల్‌తో పాటు విలీన గ్రామాలను యధావిథిగా పంచాయతీలుగానే కొనసాగించాలని ఆదేశించింది.
ప్రత్యేక పాలన నకిరేకల్ మున్సిపాలిటీ రద్దు కావడంతో హైకో ర్టు ఆదేశాల మేరకు నకిరేకల్‌తో పాటు మరో ఆరు గ్రామ పంచాయతీలను యధావిధిగా తిరిగి పునరుద్ధరించారు. 2014 ఫిబ్రవరి 4వ తేదీనుంచి ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లాయి. ఈ ఏడు పంచాయతీలకు ఈఓఆర్డీ కమలాకర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నిలిచిన అభివృద్ధి
నకిరేకల్ పట్టణంతో పాటు వీలీనమైన ఆరు గ్రామాల్లో మున్సిపాలిటీగా ఉన్న సమయంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.1 కోటి నిధులు మంజూరయ్యాయి. వీటిలో రూ. 70 లక్షలు నకిరేకల్ పట్టణానికి, మిగతా రూ. 30 లక్షలు విలీనమైన గ్రామాలకు కేటాయించారు. ఇట్టి నిధులుతో డ్రెయినేజీలు, సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సింది ఉంది. ఇందుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ, నిర్మాణం పనులు మాత్రం ఎక్కడా చేపట్టిన దాఖలాలు లేవు. మరో వైపు 13వ ఆర్థిక సంఘం, ఇతర పథకాల నుంచి అభివృద్ధి పనుల కోసం నిధులు వచ్చి చేరుతున్నాయి. అయితే పంచాయతీలకు సర్పం చులు లేకపోవడం, అధికారులు కూడా ప్రభుత్వ పథకాల అమలులో తీరిక లేకుండా ఉండటంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఏడు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది.
వేధిస్తున్న సమస్యలు
నకిరేకల్‌తో పాటు ఆరు విలీన గ్రామాల్లో ఎక్క డి సమస్యలు అక్కడే ఉన్నాయి. నకిరేకల్‌లో ప్రధానంగా డ్రెయినేజీ పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యతో పాటు పలు కాలనీల్లో వీధి వీధి దీ పాలు సరిగా వెలగడం లేదు. సీసీ రోడ్లు కూడా సరిగా లేవు. ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నకిరేకల్‌లో డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి రూ.5కోట్లు నిధు లు మంజూరు చేస్తానని ప్రకటించినప్పటికీ ఇంకా ఆచరణలో ఆమోదం లభించలేదు. కడపర్తికి 20 రోజులుగా కృష్ణా జలాల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు ప డుతున్నారు.చందుపట్లలో మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయి. తాగునీటి ట్యాంకును సైతం శుభ్రం చేసేవారు లేక గ్రామస్తులు అందులోని నీటిని సేవించడమే మానేశారు. ప్యూరిఫైడ్ వాటర్‌ను కొనుగోలు చేస్తూ దా హం తీర్చుకుంటున్నారు. తాటికల్‌లోనూ ఇదే పరిస్థితి. కృష్ణా జలాలు అందక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి.నోముల, చందంపల్లి, నెల్లిబండ గ్రామాల్లో పారిశుధ్యం తాండవిస్తోంది. అంతేకాకుండా సర్పంచ్‌లు లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని అయోమయంలో ప్రజలు ఉన్నారు.
తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి
నకిరేకల్ పట్టణంతో పాటు మిగితా ఆరు గ్రామాల్లోనూ తక్షణమే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలి. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడింది. ప్రత్యేక పాలనలో అధికారి అందుబాటులో లేకపోవడం వల్ల సమస్యలు తీరడం లేదు. -గాదగోని కొండయ్య, తాటికల్
ప్రభుత్వం చొరవ చూపాలి
మా గ్రామాన్ని గతంలో మున్సిపాలిటీలో కలిపారు. ఆ తరువాత మున్సిపాలిటీ రద్దు కావడంతో ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవచూపి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. సర్పంచ్‌ల పాలన జరిగేలా చూడాలి.
-నక్క రాంబనేష్ ముదిరాజ్, కడపర్తి
విలీన పంచాయతీలకు ఎన్నికలెప్పుడో?
Published Mon, Feb 16 2015 12:12 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement