సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని తాము భావిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ శవాన్ని మోయడం భరించలేని వేదన కలిగించేదేనని, ఇది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలను తాము ఏమాత్రం విస్మరించడం లేదని, అయితే ముందు విద్యార్థుల మార్కుల సమస్యను పరిష్కరించి ఆ తరువాత బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించే వ్యవహారాన్ని చూస్తామంది. పరీక్ష ఫెయిల్ అయిన 3 లక్షల మంది విద్యార్థుల పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేసి ఆ వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 8కి వాయిదా వేసింది. హైకోర్టుకు వేసవి సెలవులు అయినప్పటికీ ఈ కేసును ప్రత్యేకంగా విచారిస్తామంది. ప్రభుత్వం సమర్పించే నివేదికను పరిశీలించి ఎందరు విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేదన్న అంశం ఆధారంగా పునర్ మూల్యాంకనంపై మే 15న నిర్ణయం తీసుకుంటామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం సక్రమంగా చేయకపోవడం వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరిగిందని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీ వాల్యుయేషన్‌కు ఆదేశాలు ఇవ్వడంతోపాటు మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.
అందరివీ పునర్ మూల్యాంకనం చేయాలనడంలో అర్థం లేదు...
ప్రభుత్వం కేవలం రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు మాత్రమే నిర్ణయించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది సి. దామోదర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మూల్యాంకనం బాధ్యతలను కాంట్రాక్టర్ లెక్చరర్లకు అప్పగించారని, దీనివల్ల తప్పులు జరిగాయన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌తో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. పరీక్ష ఫెయిలైన వారిలో లక్షన్నర మంది పాసయితే అందరి పత్రాలనూ పునర్ మూల్యాంకనం చేయాలని కోరడంలో ఏమాత్రం అర్థం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చేపడుతున్న రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌తో ఎందరు సంతృప్తి చెందుతారో చూద్దామని, ఎవరైతే సంతృప్తి చెందలేదో వారి విషయాన్ని తరువాత పరిశీలిస్తామంది. దామోదర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ జవాబులు రాసినా మార్కులు వేయలేదన్నారు.
8న అయినంత వరకు నివేదిక ఇస్తాం...
విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఎప్పుడు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించగా మే 8 లేదా 9లోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు తెలిపారు. 9న వాటి తాలూకు ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఆ తేదీల్లో హైకోర్టుకు వేసవి సెలవులు ఉంటాయని, అందువల్ల 7వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి 8న ఫలితాలు వెల్లడించేలా చూడాలని ధర్మాసనం తెలిపింది. అది చాలా కష్టసాధ్యమని, అయినంత వరకు కోర్టుకు నివేదిక సమర్పిస్తామని ఏఏజీ చెప్పారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను మే 8కి వాయిదా వేసింది.
నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది...
ఇంటర్ ఫలితాల్లో స్టాఫ్‌వేర్ లోపం వల్లే సమస్య వచ్చినట్లు ప్రభుత్వం అంగీకరించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు నిర్ణయించినందున ఈ వ్యవహారంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, అందువల్ల ఈ విషయంలో ముందే ఓ నిర్ణయానికి రావడం సరికాదని ధర్మాసనం సూచించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది. ఈ సమయంలో దామోదర్‌రెడ్డి మరోసారి జోక్యం చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల పత్రాలను పునర్ మూల్యాంకనం చేయించాలని, వారి మృతికి కారణమైన వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని కోరారు. అయితే ప్రతి దానికీ పునర్ మూల్యాంకనం పరిష్కారం కాదని ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment