డీలర్ల సంఘం సమావేశం రసాభాస | High tension between two groups during ration deales committee meeting | Sakshi
Sakshi News home page

డీలర్ల సంఘం సమావేశం రసాభాస

Published Wed, Apr 29 2015 7:35 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

High tension between two groups during ration deales committee meeting

- రెండు గ్రూపులుగా విడిపోయిన సంఘం నేతలు, వాదులాట
- గొడవ కారణంగా సమావేశానికి రాని మంత్రి ఈటల
- మధ్యలోనే వెళ్లిపోయిన అధికారులు
- మంత్రిని కలిసి వివరణ ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. డీలర్ల సంఘం నేతలు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పర దూషణలు, వాదులాటకు దిగడంతో సమావేశం అర్ధాంతరంగా రద్దైంది. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖను పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించేందుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేస్తున్న సరుకుల సరఫరా, పంపిణీ తదితరాల్లో మార్పులు, చేర్పులకు దిగింది. శాఖ ప్రక్షాళనలో కీలక భాగస్వాములైన డీలర్లతోనూ సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఆశయాలను వారికి వివరించడంతో పాటు, అపరిషృ్కతంగా ఉన్న డీలర్ల సమస్యలను పరిష్కరించాలని భావించింది. దీనిలో భాగంగానే బుధవారం లక్డీకాపూల్‌లోని ఫ్యాఫ్సీ భవన్‌లో వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సుమారు అన్ని జిల్లాల నుంచి 500ల మంది వరకు హాజరయ్యారు. సమావేశానికి మంత్రి రాకముందే సభా వేదికపై నేతలను పిలిచే క్రమంలోనే గొడవ రేగింది. అసలు డీలరే కానీ వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడుగా ఎలా ఉంటాడని ప్రస్తుత అధ్యక్షుడు నాయకోటి రాజును ఉద్దేశించి ఓ వర్గం డీలర్లు గొడవకు దిగారు. ఏరోజూ డీలర్ల సంక్షేమం పట్టింకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి ప్రతిగా రాష్ట్ర అధ్యక్షుడి వర్గం ప్రతిదాడికి దిగింది. ఏడు జిల్లాల డీలర్లంతా కలిసి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నామంటూ ఎదురుదాడికి దిగింది. కొందరు విషపురుగులు వచ్చి సమావేశాన్ని చెడగొట్టే యత్నాలు చేస్తున్నారని, గతంలోనూ ఇదేమాదిరి వ్యవహరించారని ఆరోపణలు చేసింది. దీంతో సమావేశంలో ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పర దూషణలలు, వాదులాటకు దిగడంతో సమావేశానికి వచ్చిన అధికారులు బయటకు వెళ్లిపోయారు. గొడవ విషయం తెలుసుకున్న మంత్రి ఈటల సమావేశానికి రాలేనని సమాచారం పంపారు. చాలాసేపు సమావేశ మందిరం బయట కూర్చున్న అధికారులు గొడవ సద్దుమణగకపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. గొడవ పెద్దదయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరినీ శాంతపరిచే యత్నం చేశారు. మంత్రిని కలిసి వివరణ.. కాగా సమావేశం రద్దైన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు మంత్రి ఈటలను మినిష్టర్స్ క్వార్టర్స్‌లో కలిసి గొడవపై వివరణ ఇచ్చారు. దురుద్ధేశ్య పూర్వకంగానే ఒకరిద్దరు డీలర్లు ఇదంతా చేశారని దృష్టికి తెచ్చారు. గొడవను పట్టించుకోకుండా డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, కమీషన్ పెంచే విషయమై త్వరగా నిర్ణయం చేయాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement