రేషన్‌ డీలర్లపై కేసీఆర్‌ సర్కార్‌ వరాల జల్లు | Sarkar bounties on dealers | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్లపై కేసీఆర్‌ సర్కార్‌ వరాల జల్లు

Published Wed, Aug 9 2023 1:06 AM | Last Updated on Wed, Aug 9 2023 8:44 AM

Sarkar bounties on dealers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రేషన్‌ డీలర్లపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా బియ్యం పంపిణీకి గాను వారికిచ్చే కమీషన్‌ను మెట్రిక్‌ టన్నుకు రూ.900 నుంచి రూ.1,400 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే డీలర్లు డిమాండ్‌ చేస్తున్న మరో 13 అంశాలపై కూడా సానుకూలంగా స్పందించింది.

రేషన్‌ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సచివాలయంలో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు ప్రభుత్వానికి, రేషన్‌ డీలర్లకు ఆమోదయోగ్యమైన విధంగా కమీషన్‌ను పెంచడంతో పాటు మరో 13 డిమాండ్లను పరిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు.

కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్‌షిప్‌ను మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడన్నల బీమా తరహాలో రేషన్‌ డీలర్లకు రూ.5 లక్షల బీమా వర్తింప చేయడం, ప్రతి డీలర్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం, వయోపరిమితి 40 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంపు తదితర 13 అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.200 గా ఉన్న డీలర్ల కమీషన్‌ను దశలవారీగా పెంచుతూ రూ.1400కు చేర్చినట్లు మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. 

దీర్ఘకాల డిమాండ్లకు పరిష్కారం 
రాష్ట్రంలోని పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యానికి సంబంధించి ప్రస్తుతం డీలర్లకు మెట్రిక్‌ టన్నుకు రూ.900 చొప్పున కమీషన్‌ అందుతోంది. దీనిని పెంచాలని గత కొంతకాలంగా డీలర్లు ఆందోళన చేస్తున్నారు. గత నెలలో సమ్మెలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అయితే మంత్రి గంగుల ఇచ్చిన హామీ మేరకు గత నెలలో బియ్యం పంపిణీ చేసిన డీలర్లు, ఈ నెలలో తమ సమస్యలు పరిష్కారమైతేనే బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.

దీంతో ప్రభుత్వం ఈనెల 5 నుంచి ప్రారంభం కావలసిన బియ్యం పంపిణీని 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మంత్రులు హరీశ్, గంగులతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావ్‌ గౌడ్, రేషన్‌ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి డీలర్ల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు.

కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 17,227 మంది డీలర్లకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో మొత్తం 90.05 లక్షల ఆహారభద్రత కార్డులు ఉన్నాయి. వాటిలో 35.56 లక్షల కార్డులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులు కాగా మిగతా 54.5 లక్షల కార్డులు కేంద్రం మంజూరు చేసినవి. ఈ కార్డులకు గాను 2.82 కోట్ల మంది లబ్ది దారులకు ప్రతినెలా 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.  

ప్రభుత్వంపై రూ.138.73 కోట్ల భారం 
డీలర్ల కమీషన్‌ను రూ.1,400కు పెంచడం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.138.73 కోట్ల భారం పడనుంది. కమీషన్‌ మొన్నటివరకు రూ.700 ఉండగా రెండు నెలల క్రితం కేంద్రంతో జరిగిన సర్దుబాటు వల్ల రూ.200 పెంచి రూ.900 కమీషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. రూ.700 ఉన్నప్పుడు రూ.45.36 కోట్ల కేంద్రం వాటా పోగా, రాష్ట్రం వాటా రూ.106.33 కోట్లతో డీలర్లకు మొత్తం రూ.151.69 కోట్లు ఏటా వెచ్చించాల్సి వచ్చేది.

అయితే ప్రస్తుతం కమీషన్‌ను రూ.1,400కు పెంచడంతో ఏటా మొత్తం రూ.303.38 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందులో కేంద్రం వాటా రూ.58.32 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.245.06 కోట్లకు పెరిగింది. అంటే రూ.138.73 కోట్ల అదనపు భారం పడుతోందన్నమాట.

డీలర్లకు మరికొన్ని ప్రభుత్వ వరాలు 
♦ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వే బ్రిడ్జిల ఏర్పాటు 
♦  డీలర్‌షిప్‌ రెన్యువల్‌ను ఐదేళ్ల కాలపరిమితికి పెంచడం 
♦ డీలర్‌ మరణిస్తే అంత్యక్రియల నిర్వహణకు రూ.10 వేల తక్షణ సాయం 
♦ 1.5 క్వింటాళ్ల వేరియేషన్‌ (తేడా)ను కేసుల పరిధి నుంచి తీసివేయడం 
♦ హైదరాబాద్‌లో రేషన్‌ భవన్‌ నిర్మాణానికి భూ కేటాయింపు

కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన డీలర్లు 
కమీషన్‌ పెంపు సహా తమ ఇతర సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేషన్‌ డీలర్లు కృతజ్ఞతలు తెలిపారు. తమ వినతులపై సీఎం సానుకూలంగా స్పందించడంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్, రేషన్‌ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement