సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఎదురైన నిరసనలు.. చర్లపల్లి జైలు వద్ద కూడా కొనసాగుతున్నాయి. ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను తమకు అప్పగించాంటూ కొంత మంది యువకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు రంగంలోకి దిగారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంత్తాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను నిలువరించేందుకు జైలు వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నలుగురు నిందితులను హైసెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచినట్లు జైలు అధికారుల సమాచారం.
కాగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కొంత సమయం క్రితమే నిందితులను చర్లపల్లికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో జైలు వద్దకు ముందుగానే భారీగా ఆందోళనకారులు చేరుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలని ధర్నాకు దిగారు. లేనిపక్షంలో వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment