పీఆర్సీ పీటముడి వీడేనా..?
* ఉద్యోగ సంఘాల నేతల్లో ఆందోళన
* హైపవర్ కమిటీ ఏర్పాటుతో హైటెన్షన్
* ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల భేటీలో కమిటీపైనే ప్రధాన చర్చ
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పదో పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పీఆర్సీ సిఫారసులను పరిశీలించి, ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఇటీవలే హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడంతో.. ఇప్పట్లో తేల్చరేమోనన్న టెన్షన్ ఉద్యోగులు, పెన్షనర్లలో నెలకొంది. మంగళవారం టీఎన్‌జీవో భవన్‌లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది.
ఉద్యోగ సంఘాల నేతలు హైపవర్ కమిటీ ఏర్పాటును పైకి స్వాగతించినా.. ఈ కమిటీ వల్ల పీఆర్సీ అమలు ఆలస్యమవుతుందా అని లోలోన ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన గడువు (మూడోవారం) మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. కానీ, హైపవర్ క మిటీ నుంచి కనీసం పిలుపు కూడా రాకపోయేసరికి ఉద్యోగ సంఘాలకు దిక్కుతోచడం లేదు. టీఎన్‌జీవో కార్యాలయంలో చైర్మన్ దేవీప్రసాద్ అధ్యక్షతన జరిగిన జేఏసీ సమావేశంలో 84 ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రధాన అంశాలపై సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించింది. సమావేశంలో వివిధ సంఘాల నేతలు మమత, పి.మధుసూదన్‌రెడ్డి, పి.వెంకట్‌రెడ్డి, రేచల్, భుజంగరావు, శివశంకర్, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాలు ఇవీ...
- కనీస వేతనం రూ. 15 వేలు చేయాలి.
- 69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలి.
- 2013 జూలై 1 నుంచే పీఆర్సీని నగదు రూపంలో వర్తింపజేయాలి.
- గ్రాట్యుటీ రూ. 15 లక్షలకు పెంచాలి.
- ఈ ప్రధాన అంశాలపై సీఎం నిర్ణయం తీసుకోవాలి.
- సీఎం హామీకి అనుగుణంగా వెంటనే హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వాలి
- గెజిటెడ్ హెచ్‌ఎం, జూనియర్ అసిస్టెంట్లు, వెటర్నరీ వైద్యుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకోసం అనామలీస్ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
- సీఎంను, ప్రదీప్‌చంద్రను కలసి ఈ తీర్మానాలను తెలియజేయాలని నిర్ణయించారు.
వచ్చేవారం సంఘాలతో హైపవర్ కమిటీ భేటీ
పీఆర్సీపై ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ మంగళవారం తొలిసారిగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర సారథ్యంలో ఆర్థిక ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, సర్వీసెస్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిట్‌మెంట్‌పై వివిధ ఉద్యోగ సంఘాల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి చర్చించారు.
69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పట్టుబడుతున్నాయి. పదో పీఆర్సీ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసింది. ఒక్కోశాతం ఫిట్‌మెంట్‌కు దాదాపు రూ.180 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది. ఈ వారంలో చర్చలకు వీలుగా మార్గదర్శకాలు రూపొందించి వచ్చేవారంలో ఉద్యోగ సంఘాలతో చర్చించనున్నారు. ఉద్యోగ సంఘాలను జేఏసీగా చర్చలకు ఆహ్వానించనున్నట్లు తెలిసింది.
పీఆర్సీని ప్రకటించాలి
పీఆర్సీలో కనీస వేతనం రూ. 15 వేలు ఉండాలని, ఫిట్‌మెంట్ 60 శాతం ఇవ్వాలని, 2013 జూలై 1 నుంచి ఆర్థిక ప్రయోజనం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని కోరుతూ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంగళవారం కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రను కలసి మెమొరాండం అందజేసింది.
కమిటీకి విజ్ఞప్తుల వెల్లువ
పీఆర్సీ కనీస మూల వేతనాన్ని రూ.13 వేల నుంచి రూ. 15 వేలకు పెంచాలని పీఆర్సీ హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రకు ఉపాధ్యాయ సంఘాల జేఏసీ, ఇతర ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశా యి. జేఏసీ చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి నేతృత్వంలో టీటీజేఏసీ, పలు సంఘాల నేతలు వెంకట్‌రెడ్డి, భుజంగరావు, హర్షవర్దన్‌రెడ్డి, మల్లయ్య, అబ్దుల్లా, మణిపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, స్వామిరెడ్డి, రఘునందన్ మంగళవారం సచివాలయంలో ప్రదీప్‌చంద్రను కలసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు.