Powered Committee
-
'వాళ్లకు బోనస్ వచ్చేలా చర్యలు తీసుకుంటా'
హైదరాబాద్: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాల అమలు విషయాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తానని, వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం ఆయన సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ ప్రతినిధులు కార్మికుల సమస్యల్ని మంత్రికి వివరించారు. సింగరేణి యాజమాన్యం కనీస వేతన చట్టాన్ని, బోనస్ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. దీంతో మంత్రి స్పందిస్తూ కాంట్రాక్టు కార్మికులకు బోనస్‌లు వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. త్వరలో సింగరేణి యాజమాన్యంతో సమావేశం నిర్వహించనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. -
కోడ్‌కు ముందే పీఆర్సీ కూయాలి!
పీఆర్సీకి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ గండం! ముందే అమలు చేయకపోతే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో పీఆర్సీ అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంకి మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెలలోనే మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగానే కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ఆ సమయంలో పీఆర్సీ అమలుచేసే పరిస్థితి ఉండదు. అదే జరిగితే ఉద్యోగులు పీఆర్సీ కోసం ఏప్రిల్ వరకు ఎదురుచూడకతప్పదు. 2013 జూలై 1 నుంచే అమల్లోకి తేవాల్సిన పీఆర్సీ ఇప్పటికే ఆలస్యమయిందన్న ఆందోళన ఉద్యోగులు, పెన్షనర్లలో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జనవరి మూడో వారంలో పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించడంతో కొంత ఊరట చెందారు. అయితే రెండోవారంలో పీఆర్సీ నివేదికలోని సిఫారసుల పరిశీలన, ఉద్యోగ సంఘాలతో చర్చల కోసమంటూ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటుచేయడంతో మూడోవారంలో పీఆర్సీ అమల్లోకి రాలేదు. దీంతో పీఆర్సీ అమలులో జాప్యం చేస్తారేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో మళ్లీ మొదలైంది. మరోవైపు హైపవర్ కమిటీ ప్రస్తుతం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఈ సమావేశాలు ముగియనున్నాయి. సంఘాల డిమాండ్లతో కూడిన నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందజేయాలని సంఘాలు కోరుతున్నాయి. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే జారీ కానున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే పీఆర్సీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్యలు చేపట్టాలని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజనతో సంబంధం లేకుండా ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి సీఎం కేసీఆర్ పీఆర్సీని అమల్లోకి తేవాలని కోరారు. ఉద్యోగుల డిమాండ్ల మేరకు 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, వేతన వ్యత్యాసాలను తొలగించాలని, 2013 జూలై 1 నుంచే నగదు రూపంలో పీఆర్సీని అమల్లోకి తేవాలని కోరారు. రూ.3,500 ఏమాత్రం సరిపోవు: పోలీసు అధికారుల సంఘం ‘పోలీసు యూనిఫాం అలవెన్స్’ కింద రూ.3,500లు మాత్రమే ఇవ్వాలని పదోవేతన సవరణ సంఘం(పీఆర్సీ) తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేయడంపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పీఆర్సీ నివేదికలో కింది స్థాయి పోలీసులకు కేటాయింపులు సరిగా లేవని అభిప్రాయపడింది. పోలీసుల సమస్యలపై ఏ మాత్రం స్పందించలేదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నేతృత్వంలో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు పీఆర్సీ హైపర్ కమిటీ చైర్మన్ ప్రదీప్ చంద్రను కలసి పోలీసుల సమస్యలను వివరించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని అంశాలు... 2005లో 8వ పీఆర్సీలో కానిస్టేబుళ్లను పైస్థాయి కేడర్‌తో సమానం చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల సీనియర్లకు అన్యాయం జరిగింది. ప్రతి 5 సంవత్సరాల సీనియారిటీకి ఓ ఇంక్రిమెంట్ చొప్పున 20 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి 4 ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తేనే సీనియర్లకు న్యాయం జరుగుతుంది. కిందిస్థాయి పోలీసులకు పీఆర్సీ కేవలం రూ.300 పెట్రోల్ అలవెన్స్‌ను మాత్రమే సిఫారసు చేసింది. కనీసం నెలకు 30 లీటర్ల పెట్రోల్‌ను మంజూరు చేయాలి. ప్రస్తుతం రిస్కు అలవెన్స్‌గా రూ.150 మాత్రమే ఇస్తున్నారు. దానిని బేసిక్‌లో 15 శాతానికి పెంచాలి. ట్రాఫిక్ పోలీసులకు బేసిక్‌లో 30 శాతం పోల్యూషన్ అలవెన్స్ మంజూరు చేయాలి. కానిస్టేబుల్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న రవాణా భత్యాన్ని రూ.150 నుంచి రూ.300కు పెంచాలి. కనీస వేతనం రూ.15 వేలు ఉండాలి. పదవి విరమణ గ్యాట్యుటీని పీఆర్సీ రూ.8లక్షల నుంచి రూ.12 లక్షలకు సిఫారసు చేసింది. దానిని రూ.20లక్షలకు పెంచాలి. -
శాస్త్రీయ లెక్కలతోనే పీఆర్సీ
హైపవర్ కమిటీకిఉద్యోగ సంఘాల విజ్ఞప్తి పీఆర్సీపై సంఘాలతో మొదలైన సమావేశాలు తమ డిమాండ్లను తెలియజేసిన ఉద్యోగ సంఘాలు నివేదిక ఇవ్వడంలో ఆలస్యం చేయం: కమిటీ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కనీస మూల వేతనం ఖరారు, వేతనాల పెంపు విషయంలో పీఆర్సీ కమిషన్ వేసిన లెక్కలు సరికావని, శాస్త్రీయ లెక్కలతోనే రాష్ట్రంలో పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. కుటుంబం అంటే నలుగురిని (భార్యా భర్త, ఇద్దరు పిల్లలు) పరిగణనలోకి తీసుకొని కనీస మూల వేతనం రూ. 15 వేలుగా నిర్ధారించాలని కోరాయి. ముగ్గురినే పరిగణనలోకి తీసుకొని రూ. 13 వేలుగా నిర్ధారించడం సరైందని కాదని పేర్కొన్నాయి. పీఆర్సీలోని వివిధ అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చల్లో భాగంగా మొదటి రోజైన గురువారం టీఎన్జీఓ, టీజీఓ, గ్రూపు-1 అధికారుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, రెవెన్యూ సర్వీసెస్, క్లాస్-4, డ్రైవర్స్ అసోసియేషన్లతో సచివాల యంలో హైపవర్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా ఆయా ఉద్యోగ సంఘాల అధ్యక్షులు దేవీప్రసాద్, మమత, చంద్రశేఖర్ గౌడ్, మామిడి నారాయణ, శివశంకర్ తదితరులు తమ డిమాండ్లను కమిటీ ముందుంచారు. ఇంక్రిమెంటు రేటును పెంచాలని కోరారు. పెరిగిన నిత్యావసర ధరల ప్రకారం 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 69 శాతం ఫిట్మెంట్, కనీస మూల వేతనం పెంపు ఎందుకనే అంశాల్లో శాస్త్రీయ లెక్కలను వివరించారు. మరో ప్రధాన అంశమైన పీఆర్సీని నగదు రూపంలో 2013 జూలై 1వ తేదీ నుంచే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు భారీగా ప్రయోజనాలను నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల వయోపరిమితిని పెంచినందున అక్కడి ఉద్యోగులకు ఫిట్మెంట్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేదని, పైగా ఇప్పట్లో రిటైర్‌అయ్యే వారు లేనందున ఇబ్బంది లేదన్నారు. కాని తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలియజేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత ఇచ్చిన మొదటి పీఆర్సీ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, ఆ నష్టాన్ని పూడ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. హెచ్ఆర్ఏను పెంచాలని డిమాండ్ చేశారు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంను 5, 10, 15, 20, 25, 30 ఏళ్లకు ఒకసారి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఆర్సీ హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చల తరువాత తాము నివేదిక ఇవ్వడంలో ఎలాంటి ఆలస్యం చేయబోమని, వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు తెలియజేసినట్లు తెలిసింది. తాము నివేదిక ఇచ్చాక, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన అంశాలపై ఆర్థికశాఖ అధికారులతో, ఉద్యోగ సంఘాలతో చర్చించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. -
3 నుంచి పీఆర్సీ హైపవర్ కమిటీ భేటీలు
* తొలుత టీఎన్జీవోలతో సమావేశం * రెండు మూడు రోజులకో సంఘంతో చర్చలు జరిపే అవకాశం * ఈ లెక్కన రెండు మూడు నెలలు సమావేశాలకే సరి! సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలను వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అందులో పీఆర్సీ నివేదికలోని అంశాలు, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సవివరంగా తెలుసుకోనుంది. తొలుత మంగళవారం (27వ తేదీ) నుంచే ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని భావించినా... సాధ్యమయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో 3వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. దీనిలో భాగంగా రెండు మూడు రోజులకు ఒక సంఘంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. తొలుత తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) సంఘంతో చర్చించనున్నట్లు తెలిసింది. అయితే పీఆర్సీ అమలులో ప్రధాన అంశాలైన కనీస మూల వేతనం రూ. 13 వేల నుంచి రూ. 15 వేలకు పెంపు, 69 శాతం ఫిట్మెంట్ డిమాండ్, 2013 జూలై 1 నుంచే నగదు రూపంలో వర్తింపు, గ్రాట్యుటీ రూ.15 లక్షలకు పెంపు, హెచ్ఆర్ఏ పెంపు వంటివాటిపై సీఎం స్థాయిలోనే నిర్ణయం జరగాల్సి ఉన్నందున... కమిటీ చర్చించినా తేలే అవకాశం లేదు. వీటిని యథాతథంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. మిగతా అంశాలు, ఇతర అలవెన్సులు, వేతన వ్యత్యాసాలు తదితరాలపై హైపవర్ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించే అవకాశం ఉంది. అయితే చర్చల పేరుతో ప్రభుత్వం పీఆర్సీ అమల్లో కాలయాపన చేస్తుందేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. జనవరి మూడో వారం కల్లా పీఆర్సీ అమలుపై స్పష్టత వస్తుందని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించినా... అది ఆచరణలోకి రాలేదు. కేవలం కమిటీ ఏర్పాటుకే ప్రభుత్వం పరిమితమైంది. ఇపుడు చర్చలు ముగియాలంటే కనీసం రెండు మూడు నెలలు పడుతుందని, దీంతో పీఆర్సీ అమలు ఆలస్యం అవుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
పీఆర్సీల అమలు ఆలస్యంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం
హైపవర్ కమిటీకి విన్నవించిన ఉద్యోగ జేఏసీ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 9 పీఆర్సీల అమలులో జరిగిన జాప్యం వల్ల ఉద్యోగులు 12 ఏళ్ల కాలపు ప్రయోజనాలను నష్టపోయారని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పేర్కొంది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, టీఎన్జీవోస్, టీజీవో ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల నేతలు రాజిరెడ్డి, మల్లారెడ్డి, టీఎస్టీయూనేతలు ఆడమ్స్, రహమాన్ బుధవారం సచివాలయంలో హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రను కలిశారు. ఏపీ ఏర్పడినప్పుడు తెలంగాణలోని ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, ఆ సమయంలో ఇచ్చిన మొదటి పీఆర్సీలో... అంతకుముందు తెలంగాణ ఉద్యోగులకున్న వేతనాలను తగ్గించి ఆంధ్రా ఉద్యోగులతో సమానం చేశారన్నారు. ప్రస్తుత పీఆర్సీ అమలులో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని ప్రదీప్‌చంద్రకు వివరించారు. పీఆర్సీ అమలుపై జేఏసీ మంగళవారం నిర్వహించిన సమావేశపు తీర్మానాలను ప్రదీప్‌చంద్రకు అందజేశామని, వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారని జేఏసీ నేతలు తెలిపారు. -
పీఆర్సీ పీటముడి వీడేనా..?
* ఉద్యోగ సంఘాల నేతల్లో ఆందోళన * హైపవర్ కమిటీ ఏర్పాటుతో హైటెన్షన్ * ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల భేటీలో కమిటీపైనే ప్రధాన చర్చ సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పదో పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పీఆర్సీ సిఫారసులను పరిశీలించి, ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఇటీవలే హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడంతో.. ఇప్పట్లో తేల్చరేమోనన్న టెన్షన్ ఉద్యోగులు, పెన్షనర్లలో నెలకొంది. మంగళవారం టీఎన్జీవో భవన్లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఉద్యోగ సంఘాల నేతలు హైపవర్ కమిటీ ఏర్పాటును పైకి స్వాగతించినా.. ఈ కమిటీ వల్ల పీఆర్సీ అమలు ఆలస్యమవుతుందా అని లోలోన ఆలోచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన గడువు (మూడోవారం) మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. కానీ, హైపవర్ క మిటీ నుంచి కనీసం పిలుపు కూడా రాకపోయేసరికి ఉద్యోగ సంఘాలకు దిక్కుతోచడం లేదు. టీఎన్జీవో కార్యాలయంలో చైర్మన్ దేవీప్రసాద్ అధ్యక్షతన జరిగిన జేఏసీ సమావేశంలో 84 ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రధాన అంశాలపై సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించింది. సమావేశంలో వివిధ సంఘాల నేతలు మమత, పి.మధుసూదన్‌రెడ్డి, పి.వెంకట్‌రెడ్డి, రేచల్, భుజంగరావు, శివశంకర్, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు ఇవీ... - కనీస వేతనం రూ. 15 వేలు చేయాలి. - 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. - 2013 జూలై 1 నుంచే పీఆర్సీని నగదు రూపంలో వర్తింపజేయాలి. - గ్రాట్యుటీ రూ. 15 లక్షలకు పెంచాలి. - ఈ ప్రధాన అంశాలపై సీఎం నిర్ణయం తీసుకోవాలి. - సీఎం హామీకి అనుగుణంగా వెంటనే హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వాలి - గెజిటెడ్ హెచ్ఎం, జూనియర్ అసిస్టెంట్లు, వెటర్నరీ వైద్యుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకోసం అనామలీస్ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. - సీఎంను, ప్రదీప్‌చంద్రను కలసి ఈ తీర్మానాలను తెలియజేయాలని నిర్ణయించారు. వచ్చేవారం సంఘాలతో హైపవర్ కమిటీ భేటీ పీఆర్సీపై ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ మంగళవారం తొలిసారిగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర సారథ్యంలో ఆర్థిక ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, సర్వీసెస్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిట్‌మెంట్‌పై వివిధ ఉద్యోగ సంఘాల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి చర్చించారు. 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పట్టుబడుతున్నాయి. పదో పీఆర్సీ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసింది. ఒక్కోశాతం ఫిట్‌మెంట్‌కు దాదాపు రూ.180 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది. ఈ వారంలో చర్చలకు వీలుగా మార్గదర్శకాలు రూపొందించి వచ్చేవారంలో ఉద్యోగ సంఘాలతో చర్చించనున్నారు. ఉద్యోగ సంఘాలను జేఏసీగా చర్చలకు ఆహ్వానించనున్నట్లు తెలిసింది. పీఆర్సీని ప్రకటించాలి పీఆర్సీలో కనీస వేతనం రూ. 15 వేలు ఉండాలని, ఫిట్మెంట్ 60 శాతం ఇవ్వాలని, 2013 జూలై 1 నుంచి ఆర్థిక ప్రయోజనం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరుతూ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంగళవారం కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రను కలసి మెమొరాండం అందజేసింది. కమిటీకి విజ్ఞప్తుల వెల్లువ పీఆర్సీ కనీస మూల వేతనాన్ని రూ.13 వేల నుంచి రూ. 15 వేలకు పెంచాలని పీఆర్సీ హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రకు ఉపాధ్యాయ సంఘాల జేఏసీ, ఇతర ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశా యి. జేఏసీ చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి నేతృత్వంలో టీటీజేఏసీ, పలు సంఘాల నేతలు వెంకట్‌రెడ్డి, భుజంగరావు, హర్షవర్దన్‌రెడ్డి, మల్లయ్య, అబ్దుల్లా, మణిపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, స్వామిరెడ్డి, రఘునందన్ మంగళవారం సచివాలయంలో ప్రదీప్‌చంద్రను కలసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు.