* తొలుత టీఎన్జీవోలతో సమావేశం
* రెండు మూడు రోజులకో సంఘంతో చర్చలు జరిపే అవకాశం
* ఈ లెక్కన రెండు మూడు నెలలు సమావేశాలకే సరి!
సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలను వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అందులో పీఆర్సీ నివేదికలోని అంశాలు, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సవివరంగా తెలుసుకోనుంది. తొలుత మంగళవారం (27వ తేదీ) నుంచే ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని భావించినా... సాధ్యమయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో 3వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. దీనిలో భాగంగా రెండు మూడు రోజులకు ఒక సంఘంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. తొలుత తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) సంఘంతో చర్చించనున్నట్లు తెలిసింది. అయితే పీఆర్సీ అమలులో ప్రధాన అంశాలైన కనీస మూల వేతనం రూ. 13 వేల నుంచి రూ. 15 వేలకు పెంపు, 69 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్, 2013 జూలై 1 నుంచే నగదు రూపంలో వర్తింపు, గ్రాట్యుటీ రూ.15 లక్షలకు పెంపు, హెచ్‌ఆర్‌ఏ పెంపు వంటివాటిపై సీఎం స్థాయిలోనే నిర్ణయం జరగాల్సి ఉన్నందున... కమిటీ చర్చించినా తేలే అవకాశం లేదు. వీటిని యథాతథంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది.
మిగతా అంశాలు, ఇతర అలవెన్సులు, వేతన వ్యత్యాసాలు తదితరాలపై హైపవర్ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించే అవకాశం ఉంది. అయితే చర్చల పేరుతో ప్రభుత్వం పీఆర్సీ అమల్లో కాలయాపన చేస్తుందేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. జనవరి మూడో వారం కల్లా పీఆర్సీ అమలుపై స్పష్టత వస్తుందని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించినా... అది ఆచరణలోకి రాలేదు. కేవలం కమిటీ ఏర్పాటుకే ప్రభుత్వం పరిమితమైంది. ఇపుడు చర్చలు ముగియాలంటే కనీసం రెండు మూడు నెలలు పడుతుందని, దీంతో పీఆర్సీ అమలు ఆలస్యం అవుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
3 నుంచి పీఆర్సీ హైపవర్ కమిటీ భేటీలు
Published Tue, Jan 27 2015 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM
Advertisement