హన్మకొండలో సోమవారం రాత్రి సకల ఉద్యోగుల సన్నాహక సభలో సంఘీభావం తెలుపుతున్న ఉద్యోగ సంఘాల నేతలు
హన్మకొండ అర్బన్: ‘‘ఉద్యోగుల సమస్యల పరి ష్కారం కోసం ఫ్రెండ్లీ ప్రభుత్వంలో 44 నెలలు వేచిచూశాం.. 43 శాతం పీఆర్సీ సాధించడం మినహా ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. ప్రతీ సమస్య పెండింగ్‌లోనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అంగీకరించిన సీపీఎస్ విధానం కొనసాగించడానికి ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించి తప్పుచేసింది. ఉద్యమ సారథి ముఖ్యమంత్రి అయితే మన సమస్యలు పరిష్కారమవుతాయని ఇంతకాలం వేచి చూశాం. ప్రతి ఉద్యోగిలో సహనం నశించింది. సంధికాలం పూర్తయింది. ఇక మిగిలింది ప్రభుత్వంపై సమరమే. సమరశంఖం పూరించడానికి 25న సకల ఉద్యోగుల సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాం’’అని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అన్నారు. సభను విజయవంతం చేసి ఉద్యోగుల సత్తాను ప్రభుత్వాలకు చాటుదామని పిలుపునిచ్చారు. సకల ఉద్యోగుల సభ విజయవంతం కోసం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో సోమవారం రాత్రి ఉద్యోగ సంఘాల జేఏసీ సన్నాహకసభ నిర్వహించారు.
టీఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాజేశ్‌కుమార్ అద్యక్షతన జరిగిన సభలో ఉద్యోగులు తమ సమస్యల సాధన కోసం ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నామని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు, జేఏసీ రాష్ట్ర చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ అమలులో రాష్ట్ర ప్రభుత్వ పాపం కూడా ఉందన్నారు. అందుకే దానిని రద్దు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రభుత్వానికి అన్ని సమయాల్లో ఉద్యోగులు అండగా ఉన్నా రని పేర్కొన్నారు. అలాంటిది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్ పేర్లు ఏవైనా ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉమ్మడి రాష్ట్ర సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని గుర్తుచేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారన్నారు. సీపీఎస్‌పై సభకు ముందే సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఆటంకాలు సృష్టిస్తే అగ్నిగుండమే..
ఉద్యోగుల మహాసభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టిస్తే ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని, రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మారుస్తామని ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజేందర్, హైదరాబాద్ అధ్యక్షుడు ప్రతాప్ హెచ్చరించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో దసరా పండుగ లేకుండా పనిచేసిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగుల కృషి ఫలితంగానే ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. పెన్షన్లు, ఆశావర్కర్లు హౌసింగ్ ఉద్యోగులు, సెర్ఫ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేవరకూ ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జేఏసీలోని వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు ఉపేందర్‌రెడ్డి, జగన్మోహన్‌రావు, శ్రీనివాస్‌రావు, రేచల్, మహిపాల్‌రెడ్డి, నర్సింహస్వామి, కైలాసం, రమేశ్, జగదీశ్వర్, సర్వర్ హుస్సేన్, రత్నాకర్‌రెడ్డి, రత్నవీరాచారి, వేణుగోపాల్, నూతనకంటి బాబు, నరేందర్‌నాయక్, రాగి శ్రీనివాస్, బురుగు రవి, శ్యాంసుందర్, మాధవరెడ్డి, హసనుద్దీన్, శ్రీనివాస ఫణికుమార్, శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి విజయలక్ష్మి, అనిత, సునీత, వీఆర్వోల సంఘం నేతలు పాల్గొన్నారు. సీపీఎస్ ఉద్యోగులు, హౌసింగ్ ఉద్యోగులు, ఈజీఎస్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు తమతమ సమస్యల పరిష్కారం కోరు తూ జేఏసీ నేతలకు వినతిపత్రాలు అందజేశారు.
చేయాల్సినవి ఉన్నాయి..
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్‌సీ, హెల్త్ కార్డులు, ఇంక్రిమెంట్ ఇచ్చిందని.. అయితే పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని ఉద్యోగ సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. సామరస్య పూర్వక వాతావరణంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకోవాలన్నారు. పీఆర్‌సీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment