'వాళ్లకు బోనస్ వచ్చేలా చర్యలు తీసుకుంటా'
Published Sun, Mar 26 2017 7:10 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
హైదరాబాద్: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాల అమలు విషయాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తానని, వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
ఆదివారం ఆయన సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ ప్రతినిధులు కార్మికుల సమస్యల్ని మంత్రికి వివరించారు. సింగరేణి యాజమాన్యం కనీస వేతన చట్టాన్ని, బోనస్ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. దీంతో మంత్రి స్పందిస్తూ కాంట్రాక్టు కార్మికులకు బోనస్‌లు వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. త్వరలో సింగరేణి యాజమాన్యంతో సమావేశం నిర్వహించనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.
Advertisement