శాస్త్రీయ లెక్కలతోనే పీఆర్‌సీ
- హైపవర్ కమిటీకిఉద్యోగ సంఘాల విజ్ఞప్తి
- పీఆర్‌సీపై సంఘాలతో మొదలైన సమావేశాలు
- తమ డిమాండ్లను తెలియజేసిన ఉద్యోగ సంఘాలు
- నివేదిక ఇవ్వడంలో ఆలస్యం చేయం: కమిటీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: కనీస మూల వేతనం ఖరారు, వేతనాల పెంపు విషయంలో పీఆర్‌సీ కమిషన్ వేసిన లెక్కలు సరికావని, శాస్త్రీయ లెక్కలతోనే రాష్ట్రంలో పీఆర్‌సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పీఆర్‌సీపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. కుటుంబం అంటే నలుగురిని (భార్యా భర్త, ఇద్దరు పిల్లలు) పరిగణనలోకి తీసుకొని కనీస మూల వేతనం రూ. 15 వేలుగా నిర్ధారించాలని కోరాయి. ముగ్గురినే పరిగణనలోకి తీసుకొని రూ. 13 వేలుగా నిర్ధారించడం సరైందని కాదని పేర్కొన్నాయి.
పీఆర్‌సీలోని వివిధ అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చల్లో భాగంగా మొదటి రోజైన గురువారం టీఎన్‌జీఓ, టీజీఓ, గ్రూపు-1 అధికారుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, రెవెన్యూ సర్వీసెస్, క్లాస్-4, డ్రైవర్స్ అసోసియేషన్లతో సచివాల యంలో హైపవర్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా ఆయా ఉద్యోగ సంఘాల అధ్యక్షులు దేవీప్రసాద్, మమత, చంద్రశేఖర్ గౌడ్, మామిడి నారాయణ, శివశంకర్ తదితరులు తమ డిమాండ్లను కమిటీ ముందుంచారు.
ఇంక్రిమెంటు రేటును పెంచాలని కోరారు. పెరిగిన నిత్యావసర ధరల ప్రకారం 69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 69 శాతం ఫిట్‌మెంట్, కనీస మూల వేతనం పెంపు ఎందుకనే అంశాల్లో శాస్త్రీయ లెక్కలను వివరించారు. మరో ప్రధాన అంశమైన పీఆర్‌సీని నగదు రూపంలో 2013 జూలై 1వ తేదీ నుంచే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు భారీగా ప్రయోజనాలను నష్టపోవాల్సి వస్తుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల వయోపరిమితిని పెంచినందున అక్కడి ఉద్యోగులకు ఫిట్‌మెంట్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేదని, పైగా ఇప్పట్లో రిటైర్‌అయ్యే వారు లేనందున ఇబ్బంది లేదన్నారు. కాని తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలియజేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత ఇచ్చిన మొదటి పీఆర్‌సీ సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, ఆ నష్టాన్ని పూడ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. హెచ్‌ఆర్‌ఏను పెంచాలని డిమాండ్ చేశారు. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీంను 5, 10, 15, 20, 25, 30 ఏళ్లకు ఒకసారి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పీఆర్‌సీ హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ పీఆర్‌సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చల తరువాత తాము నివేదిక ఇవ్వడంలో ఎలాంటి ఆలస్యం చేయబోమని, వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు తెలియజేసినట్లు తెలిసింది. తాము నివేదిక ఇచ్చాక, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన అంశాలపై ఆర్థికశాఖ అధికారులతో, ఉద్యోగ సంఘాలతో చర్చించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం.