కోడ్‌కు ముందే పీఆర్సీ కూయాలి! | Code piarsi kuyali before! | Sakshi
Sakshi News home page

కోడ్‌కు ముందే పీఆర్సీ కూయాలి!

Published Thu, Feb 5 2015 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

Code piarsi kuyali before!

  • పీఆర్సీకి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ గండం!
  • ముందే అమలు చేయకపోతే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో పీఆర్సీ అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంకి మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెలలోనే మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

    ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగానే కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ఆ సమయంలో పీఆర్సీ అమలుచేసే పరిస్థితి ఉండదు. అదే జరిగితే ఉద్యోగులు పీఆర్సీ కోసం ఏప్రిల్ వరకు ఎదురుచూడకతప్పదు.  2013 జూలై 1 నుంచే అమల్లోకి తేవాల్సిన పీఆర్సీ ఇప్పటికే ఆలస్యమయిందన్న ఆందోళన ఉద్యోగులు, పెన్షనర్లలో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జనవరి మూడో వారంలో పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించడంతో కొంత ఊరట చెందారు.

    అయితే రెండోవారంలో పీఆర్సీ నివేదికలోని సిఫారసుల పరిశీలన, ఉద్యోగ సంఘాలతో చర్చల కోసమంటూ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటుచేయడంతో మూడోవారంలో పీఆర్సీ అమల్లోకి రాలేదు. దీంతో పీఆర్సీ అమలులో జాప్యం చేస్తారేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో మళ్లీ మొదలైంది. మరోవైపు హైపవర్ కమిటీ ప్రస్తుతం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఈ సమావేశాలు ముగియనున్నాయి.

    సంఘాల డిమాండ్లతో కూడిన నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందజేయాలని సంఘాలు కోరుతున్నాయి. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే జారీ కానున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే పీఆర్సీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్యలు చేపట్టాలని పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజనతో సంబంధం లేకుండా ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి సీఎం కేసీఆర్ పీఆర్సీని అమల్లోకి తేవాలని కోరారు. ఉద్యోగుల డిమాండ్ల మేరకు 69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని, వేతన వ్యత్యాసాలను తొలగించాలని, 2013 జూలై 1 నుంచే నగదు రూపంలో పీఆర్సీని అమల్లోకి తేవాలని కోరారు.
     
    రూ.3,500 ఏమాత్రం సరిపోవు: పోలీసు అధికారుల సంఘం


    ‘పోలీసు యూనిఫాం అలవెన్స్’ కింద రూ.3,500లు మాత్రమే ఇవ్వాలని పదోవేతన సవరణ సంఘం(పీఆర్సీ) తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేయడంపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పీఆర్సీ నివేదికలో కింది స్థాయి పోలీసులకు కేటాయింపులు సరిగా లేవని అభిప్రాయపడింది. పోలీసుల సమస్యలపై ఏ మాత్రం స్పందించలేదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నేతృత్వంలో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు పీఆర్సీ హైపర్ కమిటీ చైర్మన్ ప్రదీప్ చంద్రను కలసి పోలీసుల సమస్యలను వివరించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని అంశాలు...
     
    2005లో 8వ పీఆర్సీలో కానిస్టేబుళ్లను పైస్థాయి కేడర్‌తో సమానం చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల సీనియర్లకు అన్యాయం జరిగింది. ప్రతి 5 సంవత్సరాల సీనియారిటీకి ఓ ఇంక్రిమెంట్ చొప్పున 20 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి 4 ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తేనే సీనియర్లకు న్యాయం జరుగుతుంది.
     
    కిందిస్థాయి పోలీసులకు పీఆర్సీ కేవలం రూ.300 పెట్రోల్ అలవెన్స్‌ను మాత్రమే సిఫారసు చేసింది. కనీసం నెలకు 30 లీటర్ల పెట్రోల్‌ను మంజూరు చేయాలి.

    ప్రస్తుతం రిస్కు అలవెన్స్‌గా రూ.150 మాత్రమే ఇస్తున్నారు. దానిని బేసిక్‌లో 15 శాతానికి పెంచాలి.

    ట్రాఫిక్ పోలీసులకు బేసిక్‌లో 30 శాతం పోల్యూషన్ అలవెన్స్ మంజూరు చేయాలి.

    కానిస్టేబుల్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న రవాణా భత్యాన్ని రూ.150 నుంచి రూ.300కు పెంచాలి.

    కనీస వేతనం రూ.15 వేలు ఉండాలి.

    పదవి విరమణ గ్యాట్యుటీని పీఆర్‌సీ రూ.8లక్షల నుంచి రూ.12 లక్షలకు సిఫారసు చేసింది. దానిని రూ.20లక్షలకు పెంచాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement