కొల్లాపూర్: జిల్లా మీదుగా మరో జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధానసాగునీటి ప్రాజెక్టుల కింద పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలుగా కర్ణాటకలోని రాయిచూర్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ వరకు ఈ నేషనల్ హైవేను నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) రాష్ట్ర అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి లేఖ రాశారు.
రాయిచూర్ నుంచి గద్వాల, ఎర్రవల్లి, పెబ్బేరు, కొల్లాపూర్, ఎల్లూరు, నార్లాపూర్, లింగాల, అచ్చంపేట, దేవరకొండ, మల్లేపల్లి, మిర్యాలగూడ మీదుగా కోదాడ వ రకు నూతనంగా 370కి.మీ మేర రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ రాష్ట్ర సీఈ గణపతిరెడ్డి లేఖ నం.8679 ద్వారా ప్రతిపాదనలను ఈనెల 11న పంపారు. ఈ రోడ్డు హగ్రి- జడ్చర్ల 167వ జాతీయ రహదారి, నాగ్‌పూర్- బెంగళూరు 44, హైదరాబాద్- శ్రీశైలం 765, నకిరేకల్- నాగార్జునసాగర్ 565, హైదరాబాద్- విజయవాడ 65 రహదారులను కలుపుతూ వెళ్లేలా రూపొందించారు.
రహదారి నిర్మిస్తే ఉపయోగం ఇలా...
నూతనంగా రాయిచూర్ నుంచి కోదాడ వరకూ జాతీయ రహదారిని నిర్మిస్తే ప్రధానంగా వ్యవసాయ దిగుబడల ఎగుమతులకు ఉపయోగంగా ఉంటుందని కొల్లాపూర్‌కు చెందిన గ్రామాభ్యుదయ సేవాసంస్థ పేర్కొంది. నాగార్జునసాగర్ ఎడమకాల్వ, డిండి, లోయర్ డిండి, చంద్రసాగర్, ఎంజీఎల్‌ఐ, చిన్నమారూర్ ఎత్తిపోతల పథకం, జూరాల, నెట్టెంపాడు, తుంగభద్ర ఎడమ కాల్వ కింది విస్తారంగా పంటలను సాగుచేస్తారు.
ఈ వ్యవసాయ ఉత్పత్తులను వాణిజ్య వ్యాపార కేంద్రాలైన రాయిచూర్, కర్నూలు, మిర్యాలగూడ అక్కడి నుంచి గుంటూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు జాతీయ రహ దారి అనువుగా ఉంటుందని వారు నివేదికలో పేర్కొన్నారు. రాయిచూర్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని 9 నియోజకవర్గాలను కలుపుతూ ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు.
గతంలో కూడా అధికారులు కోదాడ నుంచి మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి మీదుగా జడ్చర్ల వరకూ 309 కి.మీ జాతీయ రహదారి, రాయిచూర్ నుంచి గద్వాల, కొత్తకోట, వనపర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కల్వకుర్తి వరకు 143 కి.మీ మరో హైవే నిర్మాణం కోసం నివేదికలు రూపొందించారు. ప్రస్తుతం ప్రతిపాదనలో ఈ రెండు అంశాలను అంతర్భాగంగా చేరారు. ఈ ప్రాజెక్టును అమలుచేసేందుకు డిసెంబర్ లో ఎంపీ నంది ఎల్లయ్య నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లి అధికారులను కలవనున్నట్లు గ్రామాభ్యుదయ సేవాసంస్థ అధ్యక్షుడు బండి వెంకటరెడ్డి వెల్లడించారు.
హైవే.. రయ్ రయ్!
Published Sat, Nov 22 2014 4:35 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM
Advertisement
Advertisement