* సవరణలపై కంపెనీ అభ్యంతరాలు
* కన్సల్టెంట్లతో డిస్కం అధికారుల చర్చలు
* తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ ఇవ్వాల్సిందేనని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డిస్కంతో మంగళవారం జరిపే సంప్రదింపులకు హిందూజా కంపెనీ డుమ్మా కొట్టింది. ఆకస్మిక పనులు ఉన్నందున రాలేకపోతున్నామని ఈ మెయిల్ ద్వారా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం పంపించింది. డిసెంబర్ మొదటి వారంలో చర్చలకు వచ్చేందుకు కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని టీఎస్ ఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, ఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
దీంతో చర్చలు వాయిదా పడ్డాయి. ఆ కంపెనీ లేవనెత్తిన అభ్యంతరాలను కన్సల్టెంట్లు డిస్కం అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో కన్సల్టెంట్లతోనే అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఒప్పందాలు, సవరణలు, కంపెనీ ప్రస్తావించి న అభ్యంతరాలపై చర్చలు జరిపారు. గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మేరకు, తెలంగాణకు రావాల్సిన వాటాను ఆ కంపెనీ సమకూర్చాల్సి ఉంటుందని కన్సల్టెంట్లకు తేల్చిచెప్పారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హిందూజా కంపెనీ నుంచి తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ (280 మెగావాట్లు) రావాలి. ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడే 1994లో హిందూజా కంపెనీతో అప్పటి ఏపీఎస్‌ఈబీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. మారిన నిబంధనల ప్రకారం 1998లో పీపీఏను సవరించుకుంది. ఆ కంపెనీ విద్యుత్‌ప్లాంట్ నిర్మాణం నిదానంగా సాగడంతో ఒప్పందాలు అమల్లోకి రాలేదు. ఈలోగా కేంద్ర ప్రభుత్వ 2003 విద్యుత్ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో పాత పీపీఏల్లో కొన్ని నిబంధనలు సవరించుకోవాలని డిస్కం అధికారులు తెలిపారు. కానీ చర్చలకు రాకుండానే హిందూజా కంపెనీ షరతులపై అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో డిస్కం ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఈఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లనుంది.
పీపీఏలపై భేటీకి హిందూజా డుమ్మా
Published Wed, Nov 26 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement