శుభ పరిణామం
నల్లగొండ టౌన్ :జిల్లాలో గత ఐదేళ్లలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఎయిడ్స్ నివారణ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నివారణ సంస చేపట్టిన శుభంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా హెచ్‌ఐవీ పరీక్షల సంఖ్య పెరుగుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య ఏటేటా తగ్గుతూ రావడం శుభపరిణామంగా వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 5, ఐసీటీసీలు 14, ఎఫ్‌ఐఐసీటీసీలు 37, పీపీపీలు 11, మొబైల్ ఐసీటీసీ 1సెంటర్‌తో పాటు మొత్తం 68 సెంటర్‌లలో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్ ఆస్పత్రిలో ఏఆర్‌టీ సెంటర్, అదే విధంగా భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియా ఆస్పత్రుల్లో మూడు లింక్‌డ్ ఏఆర్‌టీ సెంటర్‌లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా హెచ్‌ఐవీ పాజిటివ్ బాధితులకు ఉచితంగా వైద్య పరీక్షలు , గ్రూప్, వ్యక్తిగత కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందజేస్తున్నారు. దీంతో పాటు ఏఆర్‌టీ సెంటర్‌లో సీడీ-4 కౌంట్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు.
పరీక్షలు ఇలా..
జిల్లాలోని 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫిసిలిటీ ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్‌అండ్ టెస్టింగ్ సెంటర్(ఎఫ్‌ఐసీటీసీ)లు, జిల్లాలోని 11 ప్రైవేటు ఆస్పత్రులలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ సెంటర్(పీపీపీ)లు ఉన్నాయి. ఈ కేంద్రాలలో గర్భిణులు, సామాన్య ప్రజ లు, ప్రమాదకర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ఉచితంగా హెచ్‌ఐవీ పరీక్షలు పరీక్ష లు నిర్వహిస్తున్నారు. అలాగే హెచ్‌ఐవీ పాజిటీవ్ కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అవగాహన కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రస్తుతం హెచ్‌ఐవీ పాజి టివ్ కేసుల నమోదు సంఖ్య తగ్గింది. ఐసీటీసీలతో పాటు మిగతా సెంటర్‌లలో ఉచితంగా హెచ్‌ఐవీ పరీక్షలను నిర్వహించి పాజిటివ్ అని తేలితే వారిని జిల్లా కేంద్రంలోని ఏఆర్‌టీ సెంటర్‌కు పంపిస్తారు. ఏఆర్‌టీ సెంటర్‌లోని వైద్యాధికారులు వారికి ఉచితంగా సీడీ-4 కౌంట్ పరీక్షలతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
అలాగే అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో సీడీ-4 కౌంట్ పరీక్షలను నిర్వహించి 250 కంటే సీడీ-4 కణాలు తక్కువ ఉన్నవారికి ఎన్‌ఎన్‌ఆర్‌టీఐ, ఎన్‌ఆర్‌టీఐ మందులను అందజేస్తూ వారిని పరిశీలన, సంరక్షణ, కౌన్సెలింగ్ కోసం జిల్లాలోని మూడు ఆదరణ సంరక్షణ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏఆర్‌టీ మందులను క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడుతున్న వ్యక్తులకు వారి దగ్గరలోని లింక్‌డ్ ఏఆర్‌టీ సెంటర్‌లకు పంపించి మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ఏఆర్‌టీ సెంటర్‌లలో క్రమతప్పకుండా వాడిన వేలాది మంది హెచ్‌ఐవీ పాజిటివ్ బాధితుల్లో సీడీ-4, బరువులో పెరుగుదల లేని వారిని వైద్యులు , కౌన్సిలర్లు పరీక్షించి సెకండ్‌లైన్ మందుల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పిత్రికి పంపిస్తారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా నల్లగొండ యూత్ పాజిటివ్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు, జిల్లా ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన కల్పించడంతో హెచ్‌ఐవీ పాజిటివ్ కేసుల నమోదు తగ్గుతూ వస్తుంది.
జిల్లాలో హెచ్‌ఐవీ పాజిటివ్ కేసుల నమోదు వివరాలు
సంవత్సరం పరీక్షల సంఖ్య పాజిటివ్ కేసులు శాతం
2002-03 4066 386 9.05
2003-04 8919 689 7.73
2004-05 14875 1017 6.84
2005-06 19571 1473 7.53
2006-07 32557 2164 6.65
2007-08 39003 2519 6.46
2008-09 48925 2821 5.77
2009-10 59345 2670 4.50
2010 -11 77042 2537 3.29
2011-12 101930 2300 2.26
2012-13 106221 2013 1.90
2013-14మార్చి వరకు 91368 1682 1.90