సాక్షి, హైదరాబాద్: శరవేగంగా విస్తరిస్తున్న నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) సరికొత్త ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇప్పటికే కోర్ సిటీ, శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్ రూపొందించిన హెచ్‌ఎండీఏ... భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తోంది. మాస్టర్ ప్లాన్‌తో పాటు జోనల్, ఏరియా, రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లను ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా రూపొందించేందుకు ఎంప్యానల్‌మెంట్ ఆఫ్ కన్సల్టెంట్‌ల కోసం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పిలిచారు.
ఇదీ ప్లాన్...
ఇప్పటికే ఏకీకృత మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పటికీ హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏదైనా ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందితే.. ఆ ప్రాంతంలో జనాభాకు తగినట్టుగా రహదారులు, భూ వినియోగం, పరిశ్రమలు ఇలా అవసరమైనవి ఎక్కడ? ఎలా? ఉండాలనే దానిపై ఎంప్యానల్‌మెంట్ సంస్థలు అప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించి హెచ్‌ఎండీఏకు ఇస్తాయి. ఈ విధంగానే ఏరియా డెవలప్‌మెంట్ అంటే చిన్నచిన్న ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్లాన్‌లు రెడీ చేస్తాయి. ఇంకో ముఖ్యమైన అంశమేమిటంటే నగరంలోని ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్‌గా వాహన రద్దీ పెరిగి ట్రాఫిక్ జామ్‌లు నిత్యకృత్యమవుతాయి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేసేందుకు రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్‌ను కూడా ఇవి హెచ్‌ఎండీఏ అధికారుల ఆలోచనలకు అనుగుణంగా తయారు చేస్తాయి.
తుది మెరుగులు...
2041 నాటికి పెరగనున్న జనాభా, భూవినియోగం, రోడ్డు రవాణా వ్యవస్థ, నీటి వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార–వాణిజ్య రంగాలకు భూకేటాయింపులు వంటి వాటికి కచ్చితమైన పరిమితులతో ఏకీకృత మాస్టర్‌ప్లాన్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హుడా), హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (హడా), సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీడీఏ), పాత ఎంసీహెచ్, హుడా విస్తరిత ప్రాంతాలకు చెందిన మాస్టర్‌ప్లాన్‌లు కలిపిన ఏకీకృత మాస్టర్‌ప్లాన్–2041ను ప్రస్తుతం ఆస్కీ పూర్తిస్థాయిలో రూపొందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment