‘సర్వీస్‌’ స్టాప్‌! | HMDA Negligence on ORR Service Roads | Sakshi
Sakshi News home page

‘సర్వీస్‌’ స్టాప్‌!

Published Tue, Oct 15 2019 11:52 AM | Last Updated on Tue, Oct 15 2019 11:52 AM

HMDA Negligence on ORR Service Roads - Sakshi

మేడ్చల్‌లో సర్వీసు రోడ్డు ఇలా...

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లోని ఔటర్‌రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) విభాగాధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపమవుతోంది. ఓఆర్‌ఆర్‌ లైన్‌లోని రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపుతూ సర్వీసు రోడ్ల పనులను పక్కనబెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉన్నా కాలయాపన చేస్తుండడంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులు అదనంగా రెండు మూడు కిలోమీటర్లు తిరిగివెళ్లాల్సి వస్తోంది. 2012లో ఓఆర్‌ఆర్‌తో పాటే సర్వీసు రోడ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా... ఇప్పటికీ చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈదులనాగులపల్లి,  శంషాబాద్, ఘట్‌కేసర్, మేడ్చల్‌ ప్రాంతాల్లో ఓఆర్‌ఆర్‌ను తాకుతూ వెళ్తున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉండడంతో అవస్థలు పడుతున్నారు. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే సూత్రపాయంగా అనుమతిచ్చినా అధికారులు ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. దీనిపై గతంలో అప్పటి కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా... ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించి బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచలేదు.

ఎక్కడెక్కడ? ఎలా?
మేడ్చల్‌: కీసర నుంచి పెద్దఅంబర్‌పేట్‌ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజినీరింగ్‌ కళాశాల వరకు సర్వీసు రోడ్డులో ప్రయాణించి, అక్కడి నుంచి యంనంపేట్‌ గ్రామంలోకి చేరుకొని ఘట్‌కేసర్‌ బైపాస్‌ రోడ్డు కూడలి దాటి మళ్లీ సర్వీసు రోడ్డుకు చేరుకోవాలి. రైల్వే ట్రాక్‌ కారణంగా ఇక్కడ సర్వీసు రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా దాదాపు 3 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. పెద్దఅంబర్‌పేట్‌ నుంచి కీసర వైపు వెళ్లాలంటే యంనంపేట్‌ మీదుగా సర్వీసు రోడ్డుకు చేరుకోవడానికి 2 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాలి. 

శంషాబాద్‌: ఔటర్‌ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్‌ నుంచి పెద్దగోల్కొండ వైపు దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇరువైపులా సర్వీసు రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ దారి మధ్యలో ఉందానగర్‌–తిమ్మాపూర్‌ స్టేషన్ల రైల్వే ట్రాక్‌ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు మార్గంలో శంషాబాద్‌ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్‌ సమీపంలో దారి మళ్లాల్సి వస్తోంది. ఇక్కడ వాహనదారులకు దారి తెలియక అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్డు మార్గంలోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే చెన్నమ్మ హోటల్‌ సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో సైతం 2 కిలోమీటర్ల వరకు సర్వీసు రోడ్డు పనులు చేపట్టలేదు. హిమాయత్‌సాగర్‌ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండానే వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది.

ఘట్‌కేసర్‌: ఘట్‌కేసర్‌ మండలంలోని గౌడవెళ్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో సర్వీసు రోడ్డు పనులు పూర్తి కాలేదు. దీంతో వాహనదారులు 3.5 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. గౌడవెళ్లి పరిధిలో ఉన్న సికింద్రాబాద్‌–నాందేడ్‌ రైలు మార్గంలోనే రింగురోడ్డు నిర్మించారు. గౌడవెళ్లి స్టేషన్‌ సమీపంలో నుంచి రింగు రోడ్డు వెళ్తోంది. సర్వీసు రోడ్డు మాత్రం నిర్మించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘట్‌కేసర్‌ వైపు నుంచి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్‌ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్‌చెరు వైపు నుంచి వచ్చే రోడ్డులో గౌడవెళ్లి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్‌ సమీపం వరకు రోడ్డు నిర్మించారు. దీంతో సర్వీసు రోడ్డులో వచ్చే వాహనదారులు సుతారిగూడ టోల్‌ప్లాజా నుంచి గౌడవెళ్లి గ్రామం మీదుగా 3.5 కిలోమీటర్లు తిరిగి జ్ఞానాపూర్‌ బ్రిడ్జి వద్దనున్న సర్వీసు రోడ్డు నుంచి వెళ్లాల్సి వస్తోంది. పటాన్‌చెరు వైపు నుంచి వచ్చే వాహనదారుల పరిస్థితి ఇలాగే ఉంది. 

ఈదులనాగులపల్లి: రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదులనాగులపల్లి గ్రామ శివార్లలో ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈదులనాగులపల్లి, వెలమల శివార్లలో రైల్వేట్రాక్‌ కారణంగా సర్వీసు రోడ్డు అంసపూర్తిగా ఉంది. రోడ్డు లేకపోవడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక్కడ తాత్కాలికంగా మట్టితో రోడ్డు వేశారు. ఆ రోడ్డుపై నిత్యం ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. సర్వీసు రోడ్డు లేకపోవడంతో నాగులపల్లి రావాలంటే కిలోమీటర్‌ దూరం తిరగాల్సి వస్తోంది. గతంలో స్థానికులు ఆందోళన చేసినా హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ విభాగ అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement