సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పచ్చదనానికి విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బాలానగర్‌లోని శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం సేకరించిన స్థలంలో 95 చెట్లను హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు గుర్తించారు. అయితే పచ్చదనానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో 15 భారీ చెట్లను ట్రాన్స్‌లోకేషన్ (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం) చేయాలని, మరో 34 చెట్లను నరికివేయాలని, మిగిలిన 46 చెట్లను యథాతథంగానే కొనసాగించాలని గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం 15 చెట్లను ప్రణాళికాబద్ధంగా చుట్టూరా గుంతలు తీసి జేసీబీల సహాయంతో వేళ్లతో సహా భారీ వాహనాల్లో ఎక్కించి గండిమైసమ్మలోని హెచ్‌ఎండీఏ నర్సరీకి తరలించి మళ్లీ పెట్టారు. ట్రాన్స్‌లొకేషన్ ద్వారా తొలగించిన చెట్లను తొలుత సమీపంలోని ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి తరలించాలని భావించినా అక్కడ ఉన్న వస్తువు నిల్వల వల్ల హెచ్‌ఎండీఏ నర్సరీకి తీసుకెళ్లినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా ట్రాన్స్‌లొకేషన్ పనులను వేగవంతం చేశామని, 15 చెట్లను తరలించాలని తొలుత భావించినా, మరో రెండు చెట్లను కూడా తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు చెట్లను ట్రాన్స్‌లొకేషన్ చేసి కాపాడుతున్నామని, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చెట్లను కొట్టివేయాల్సి వస్తోందన్నారు. ‘ బాలానగర్ ఫ్లైవర్‌కు అడ్డంకిగా ఉన్న 95 చెట్లలో 46 చెట్లను యథావిధిగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రాన్స్‌లొకేషన్ చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చుట్టూ గుంతలు తవ్వినా చెట్ల వేళ్లు ఎక్కువగా తారుతో కప్పబడి ఉన్నాయి. కొన్ని చెట్లు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, వాటర్ పైపులు, టెలికామ్ కేబుల్స్ ఉండటంతో వీటన్నిటింటిని జాగ్రత్తగా గమనిస్తూ చెట్లను ట్రాన్స్‌లొకేషన్ చేస్తున్నాం. వేరే ప్రాంతానికి తీసుకెళ్లిన ఈ చెట్టుకు నీళ్లుపోయడం, నిర్వహణ కూడా సమస్యగా మారింద’ని తెలిపారు.
అటవీ శాఖ అధికారులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులతో కూడిన చెట్ల పరిరక్షణ కమిటీ ఆమోదముద్ర వేసిన తర్వాతే ట్రాన్స్‌లొకేషన్ పనులు చేపట్టామని హెచ్‌ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. అయితే అన్ని చెట్లు ట్రాన్స్‌లోకేషన్ చేద్దామనుకున్నా వాటి జీవితకాలం తక్కువగా ఉండటంతో కూల్చివేయాలని నిర్ణయించామని, చెట్ల పరిరక్షణ కమిటీ ఆమోదంతోనే ఇందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా బాలానగర్‌లోని శోభనా థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కిలోమీటర్ల పొడవునా ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఎనిమిది ఎకరాల 20 గుంటలు (33,175 చదరపు మీటర్ల) స్థలంలో 357 ప్రాపర్టీలకు నష్టం కలుగుతోంది. ఈ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.104.53 కోట్లు కాగా, భూసేకరణ కోసం రూ.265 కోట్లను హెచ్‌ఎండీఏ చెల్లిస్తోంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల టెండర్‌ను దక్కించుకున్న బీఎస్‌సీపీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పనులు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment