
గాంధీ ఆస్పత్రి లేబర్‌వార్డులో మహామృత్యుంజయహోమం నిర్వహిస్తున్న దృశ్యం
గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో మహా మృత్యుంజయ హోమం
ఆస్పత్రికి వాస్తు దోషమట.. తల్లీపిల్లల మరణాలు ఆగాలట!
హోమం నిర్వహణపై వెల్లువెత్తిన విమర్శలు
సాక్షి, హైదరాబాద్:
సర్జరీలు జరగాల్సిన చోట శాస్త్రోక్తంగా పూజలు చేశారు.. స్టెతస్కోప్‌తో రోగి గుండెచప్పుడు వినాల్సిన డాక్టర్లు హోమగుండం వద్ద భక్తిప్రపత్తులతో నిల్చున్నారు.. ఆసుపత్రికి పట్టిన వాస్తుదోషం తొలగిపోవాలని, తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడాలని దేవుడ్ని వేడుకున్నారు! ఈ తతంగమంతా జరిగింది ఎక్కడో కాదు.. మన రాజధాని నగరంలోని గాంధీ ఆస్పత్రిలో! సోమవారం గైనకాలజీ విభాగంలో నాలుగు గంటలపాటు హోమం చేయించడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఆస్పత్రిలో నమోదవుతున్న తల్లీబిడ్డల మరణాలకు వాస్తుదోషమే కారణమని, మృత్యుంజయ హోమం చేయించడం ద్వారా పిల్లల ప్రాణాలను కాపాడవచ్చని ఓ వ్యక్తి చెప్పడంతో గుట్టుచప్పుడు కాకుండా ఇలా చేశారు. వాస్తు దోషాలు, మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన వైద్యులే ఇలా హోమాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గాంధీ జనరల్ ఆస్పత్రి అవుట్‌పేషంట్ విభాగానికి రోజూ సగటున 2,500 మంది రోగులు వస్తుంటారు. గైనకాలజీ విభాగంలో రోజూ సగటున 30–40 ప్రసవాలు జరుగుతుంటాయి. ఆస్పత్రికి వచ్చే కేసుల్లో అధిక శాతం హైరిస్కు కేసులే ఉంటాయి. ఇటీవల బాలింతలు, చిన్నారుల మరణాలు పెరగడంతో సోమవారం హోమం చేశారు. ఇందులో గైనకాలజీ విభాగాధిపతి అనుపమ, మాజీ ఆర్‌ఎంవో ప్రమీలతోపాటు వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌ను ప్రశ్నించగా.. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.