
సాక్షి, హైదరాబాద్: పైసా లంచం లేకుండా ఇళ్ల నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు ఏప్రిల్ 2 నుంచి ‘టీఎస్–బీపాస్’పేరుతో కొత్త అనుమతుల విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మార్చిలోగా అన్ని లోటుపాట్లను సరిచేసి టీఎస్–బీపాస్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నేరు గా టీఎస్–బీపాస్ వెబ్‌సైట్ ద్వారా లేదా మీ–సేవ కేంద్రాల ద్వారా ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఇందుకోసం కొత్తగా మొబైల్ యాప్‌ను సైతం తీసుకొస్తున్నామన్నారు. ఈ మూడు మార్గాల్లో లేదా స్థానిక మున్సిపల్ అధికారులను కలవడం ద్వారా అనుమతులు పొందవచ్చన్నారు. మర్రి చెన్నారెడ్డి మాన వ వనరుల శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమావేశమై కొత్త మున్సిపల్ చట్టంతో పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుపై దిశానిర్దేశం చేశారు. కొత్తగా తెస్తున్న టీఎస్–బీపాస్ విధానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా 75 చదరపు గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితం చేసిందన్నారు.
కలెక్టర్లపై బాధ్యతలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకునే విధంగా పచ్చని, ఆహ్లాదకరమైన పట్టణాల రూపకల్పన కోసం కృషి చేయాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రతీ పౌరుడు కోరుకునేలా రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించాలని, వారి కి సంతృప్తి కలిగించేలా సమాధానాలివ్వాలన్నారు. అక్రమాలకు పాల్పడే, నిర్లక్ష్యం వహించే ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ అధికారాన్ని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు అప్పగించారని గుర్తుచేశారు. సీఎం నిర్ణయంతో వ్యవస్థలో సమూల మార్పులొచ్చాయన్నారు. కార్యక్రమంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, పురపాలక శాఖ కమిషనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment