సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేసినా టికెట్లు దక్కకపోవడంతో ఆశావహుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు టికెట్ లభిస్తుందని దాదాపు రెండు, మూడేళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించిన నేతలకు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. సోమవారం అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. పాతముఖాలనే జాబితాలో చేర్చడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల పైరవీలకు అవకాశమిస్తూ.. పలుకుబడి తో టికెట్లు తెచ్చుకోవడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. దీంతో ఎలాగైనా పోటీకి దిగాలని భావించిన కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. తమ అనుచరగణంతో నామినేషన్ వేసేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు పార్టీ టికెట్ ఆశించి భంగపడిన ఎల్‌బీనగర్ కాంగ్రెస్ నేత ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుని టికెట్ తెచ్చుకున్నారు. అదే తరహాలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కొలను హన్మంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్ టికెట్ పొందారు.
నేడే ముహూర్తం..
కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కని పలువురు నేతలు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. చేవెళ్ల నుంచి టికెట్ ఆశించిన వెంకటస్వామికి కాకుండా గత ఎన్నికల్లో పోటీ చేసిన కాలె యాదయ్యకు టికెట్ ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు వెంకటస్వామి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదిలాఉండగా పరిగి నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించిన మాజీ మంత్రి కమతం రామిరెడ్డికి ఈ సారి భంగపాటే ఎదురైంది. స్థానికంగా రాజకీయాలు మారడంతో తనపై సానుకూలత ఉందని భావిస్తున్న రాంరెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ వస్తుందని చివరివరకూ ఆశతో ఉన్న మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ షాకిచ్చింది. డీసీసీ అధ్యక్షుడు కె.మల్లేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోతున్న మల్‌రెడ్డి.. స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేయనున్నారు. మరోవైపు నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో అసంతృప్తిదారులంతా బయటకు వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌లో కలవరం
Published Wed, Apr 9 2014 12:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement