rammohan goud
-
టీఆర్ఎస్ నేత కుమారుడి హల్చల్
టోల్‌ప్లాజా వద్ద సిబ్బందిపై కత్తితో దాడిచేసిన అతడి మిత్రబృందం కడ్తాల్ (కల్వకుర్తి): శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా కడ్తాల్–మైసిగండి మధ్య ఉన్న టోల్‌ప్లాజా వద్ద అధికార పార్టీ టీఆర్ఎస్ నేత కుమారుడు తన మిత్ర బృందంతో కలసి హల్చల్ చేశాడు. నిర్ణీత మార్గంలో వెళ్లాలని సూచించిన టోల్‌ప్లాజా సిబ్బందిపై కత్తులతో దాడి చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌కు చెందిన ఆరుగురు యువకులు అరుణ్‌రెడ్డి, నిషిత్, సాయితేజ్ రెడ్డి, మనీష్‌గౌడ్, సాయికుమార్, అనిరుధ్‌లు సోమవారం కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండిలో సాయితేజ్‌రెడ్డి జన్మ దిన వేడుకలు జరిపారు. వేడుకలకు సాయి తేజ్రెడ్డితో పాటు, ఎల్బీనగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి రామ్మోహన్‌గౌడ్ కొడుకు మనీష్‌గౌడ్, ఐదుగురు మిత్రులతో కలసి జిప్సీ వాహనంలో మైసిగండి వచ్చారు. బర్త్‌డే వేడుకల అనంతరం రాత్రి తిరుగు పయనమ య్యారు. మార్గమధ్యలో కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద నిర్ణీత మార్గంలో కాకుండా పక్కన ఉన్న బారికేడ్లను తొలగించి ముందుకు సాగారు. దీంతో టోల్‌ప్లాజాలో సూపర్వైజర్గా పని చేస్తున్న కడ్తాల్కి చెందిన మాదారం మహేశ్ గౌడ్ సరైన దారిలో రావాలని కోరాడు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహేశ్‌గౌడ్‌పై దాడి చేశారు. వాహనంలో ఉన్న అరుణ్‌రెడ్డి కిందకు దిగి అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో మహేశ్‌గౌడ్‌పై దాడి చేశాడు. తప్పించుకునే ప్రయత్నంలో అతనికి రెండు చేతులకు గాయాలయ్యాయి. గమనించిన టోల్గేట్ సిబ్బంది ఆ యువకులను పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు వాహనంలో పారిపోయారు. వెంటనే టోల్‌ప్లాజా సిబ్బంది కడ్తాల్ ఎస్ఐ శ్రీకాంత్‌కు సమాచారం అందిచారు. దీంతో శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టి పారిపోతున్న యువకులను పట్టుకున్నారు. బాధితుడు మహేశ్‌గౌడ్ ఫిర్యాదు మేరకు వారిపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నా కుమారుడి ప్రమేయం లేదు హైదరాబాద్: కడ్తాల్ టోల్‌ప్లాజా దాడి కేసులో తన కుమారుడు మనీష్గౌడ్కు ఎలాంటి సంబం«ధంలేదని ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మో హన్‌గౌడ్ అన్నారు. మనీష్‌గౌడ్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడని టోల్‌గేటు వద్ద జరిగిన దాడిలో అతని స్నేహితులు సాయి, నితీష్, అరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొ న్నారని చెప్పారు. కారులో ఉన్నందునే తన కుమారుడిపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. -
మంచినీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం
అనేక సంవత్సరాలుగా హయత్‌నగర్ పరిధిలోని గాయత్రినగర్ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్న మంచినీటి పైపులైను పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పొరేటర్ సామా తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఎం. రామ్మోహన్ గౌడ్ స్వయంగా వచ్చి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు సోమవారం నుంచే పనులు కూడా ప్రారంభించారు. హయత్ నగర్ ప్రాంతంలోని మొత్తం 18 కాలనీలకు మంచినీళ్లు ఇచ్చేందుకు పనులు మంజూరయ్యాయని, ఈ కాలనీ రూపురేఖలు మార్చేందుకు అందరి సహకారం అవసరమని ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమలరెడ్డి అన్నారు. గాయత్రినగర్ కు వచ్చే మార్గమైన కుమ్మరికుంట చెరువు కట్టమీద లైట్లు లేకపోవడం, అటూ ఇటూ కంపచెట్లు ఉండటంతో ఈ సమస్యను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కట్ట మీద 14-15 లైట్లు మంజూరు చేశారని, రాబోయే 15 రోజుల్లో అవన్నీ కూడా ఏర్పాటుచేస్తారని ఆయన వివరించారు. ఇక ఔట్ లెట్ లేకపోవడం వల్లే ఈ కాలనీకి ప్రస్తుతం డ్రైనేజి కనెక్షన్ ఇవ్వలేకపోతున్నామని, త్వరలోనే అది కూడా ఏర్పాటుచేయించి దీన్ని నెంబర్ వన్ కాలనీగా రూపొందిస్తామని చెప్పారు. డివిజన్ పరిధిలో మొత్తం 770 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరైనట్లు కూడా ఆయన తెలిపారు. -
కాంగ్రెస్‌లో కలవరం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేసినా టికెట్లు దక్కకపోవడంతో ఆశావహుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు టికెట్ లభిస్తుందని దాదాపు రెండు, మూడేళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించిన నేతలకు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. సోమవారం అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. పాతముఖాలనే జాబితాలో చేర్చడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల పైరవీలకు అవకాశమిస్తూ.. పలుకుబడి తో టికెట్లు తెచ్చుకోవడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. దీంతో ఎలాగైనా పోటీకి దిగాలని భావించిన కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. తమ అనుచరగణంతో నామినేషన్ వేసేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు పార్టీ టికెట్ ఆశించి భంగపడిన ఎల్బీనగర్ కాంగ్రెస్ నేత ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని టికెట్ తెచ్చుకున్నారు. అదే తరహాలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కొలను హన్మంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ టికెట్ పొందారు. నేడే ముహూర్తం.. కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కని పలువురు నేతలు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. చేవెళ్ల నుంచి టికెట్ ఆశించిన వెంకటస్వామికి కాకుండా గత ఎన్నికల్లో పోటీ చేసిన కాలె యాదయ్యకు టికెట్ ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు వెంకటస్వామి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదిలాఉండగా పరిగి నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించిన మాజీ మంత్రి కమతం రామిరెడ్డికి ఈ సారి భంగపాటే ఎదురైంది. స్థానికంగా రాజకీయాలు మారడంతో తనపై సానుకూలత ఉందని భావిస్తున్న రాంరెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ వస్తుందని చివరివరకూ ఆశతో ఉన్న మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ షాకిచ్చింది. డీసీసీ అధ్యక్షుడు కె.మల్లేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోతున్న మల్రెడ్డి.. స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేయనున్నారు. మరోవైపు నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో అసంతృప్తిదారులంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. -
సొంత మనిషికి టీఆర్ఎస్ టికెట్ ఇప్పించిన సర్వే!!
రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి.. తీరా అది దక్కకపోవడంతో నిరాశకు గురై, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామనుకునే సమయానికి టీఆర్ఎస్ టికెట్ వరించింది. కేంద్ర మంత్రి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ అనుచరుడు రామ్మోహన్ గౌడ్. ఈయన ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని ఉత్సాహపడ్డారు. తన మనిషికి ఎలాగైనా ఆ టికెట్ ఇప్పించాలని సర్వే తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాత్రం ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి, తన టికెట్ ఖరారు చేయించుకున్నారు. దీంతో రామ్మోహన్ గౌడ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా ఎల్బీనగర్ బరిలోకి దిగాలనుకున్నారు. సరిగ్గా ఇక్కడే మళ్లీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చక్రం తిప్పారు. టీఆర్ఎస్లో తనకున్న పరిచయాలతోనే చేశారో, ఇంకేం చేశారో గానీ.. తెల్లవారేసరికి టీఆర్ఎస్ విడుదల చేసిన రెండో జాబితాలో రామ్మోహన్ గౌడ్ పేరు కనిపించింది. ఒక్కసారిగా నియోజకవర్గ ప్రజలతో పాటు.. నాయకులు కూడా విస్తుపోయారు. సోమవారం వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన అసలు ఎప్పుడు టీఆర్ఎస్లో చేరారో, ఎప్పుడు టికెట్ కోసం ప్రయత్నించారో, ఎలా సాధించారో ఎవ్వరికీ తెలియలేదు. టికెట్ మాత్రం ఇట్టే వచ్చేసింది.