సొంత మనిషికి టీఆర్ఎస్ టికెట్ ఇప్పించిన సర్వే!!
రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి.. తీరా అది దక్కకపోవడంతో నిరాశకు గురై, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామనుకునే సమయానికి టీఆర్ఎస్ టికెట్ వరించింది. కేంద్ర మంత్రి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ అనుచరుడు రామ్మోహన్ గౌడ్. ఈయన ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని ఉత్సాహపడ్డారు. తన మనిషికి ఎలాగైనా ఆ టికెట్ ఇప్పించాలని సర్వే తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాత్రం ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి, తన టికెట్ ఖరారు చేయించుకున్నారు. దీంతో రామ్మోహన్ గౌడ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా ఎల్బీనగర్ బరిలోకి దిగాలనుకున్నారు.
సరిగ్గా ఇక్కడే మళ్లీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చక్రం తిప్పారు. టీఆర్ఎస్లో తనకున్న పరిచయాలతోనే చేశారో, ఇంకేం చేశారో గానీ.. తెల్లవారేసరికి టీఆర్ఎస్ విడుదల చేసిన రెండో జాబితాలో రామ్మోహన్ గౌడ్ పేరు కనిపించింది. ఒక్కసారిగా నియోజకవర్గ ప్రజలతో పాటు.. నాయకులు కూడా విస్తుపోయారు. సోమవారం వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన అసలు ఎప్పుడు టీఆర్ఎస్లో చేరారో, ఎప్పుడు టికెట్ కోసం ప్రయత్నించారో, ఎలా సాధించారో ఎవ్వరికీ తెలియలేదు. టికెట్ మాత్రం ఇట్టే వచ్చేసింది.