సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సి వచ్చింది. అధికారులు అప్రమత్తమై ఈవీఎంలను సరిచేసి కాస్త ఆలస్యంగానైనా పోలింగ్ ప్రారంభించారు. జిల్లాలో ఉన్న ప్రఖ్యాత ఈసీఐఎల్ సంస్థ ఈవీఎంలు తయారు చేసింది. నిపుణులు ముందస్తుగా ఈవీఎంలను చెక్ చేసినా ఇబ్బందులు మాత్రం తప్పలేదు.
ఎల్బీనగర్ నియోజకవర్గం నందనవనంలోని 263/ఏ పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం వరకు ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు లైన్లలో పడిగాపులు పడ్డారు. చంటి పిల్లలతో వచ్చిన తల్లులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారులు పట్టిం చుకోకపోవడంతో బూత్ వద్ద ఆందోళనకు దిగారు. చివరికి పనిచేయని ఈవీఎం స్థానంలో మరొకటి తెచ్చి అధికారులు పోలింగ్ జరిపించారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈవీఎంలో పొందుపర్చిన బటన్లు పనిచేయకపోవడంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఖానాపూర్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 73వ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఈవీఎంలో వైఎస్సార్‌సీపీకి చెందిన బటన్ చాలాసేపు పనిచేయలేదు. గమనించిన ఓటర్లు పోలింగ్‌బూత్‌లో ఆ పార్టీ ఏజెంట్‌కు విషయం తెలిపారు.
చేవెళ్ల మండలంలోని రేగడిఘనాపూర్‌లో ఓటింగ్ యంత్రం కొద్దిసేపు ఇబ్బందిపెట్టింది. సుమారు 50 నిమిషాలు ఓటింగ్‌కు అంతరాయం కలిగింది.
శంకర్‌పల్లి మండలం రామంతాపూర్, శంకర్‌పల్లి గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే సరిచేసి పోలింగ్‌ను కొనసాగించారు.
మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం, అమ్డాపూర్, కేతిరెడ్డిపల్లి, తోల్‌కట్ట, కుత్బుద్ధీన్‌గూడలలో ఈవీఎంలు కొద్దిసేపు ఆగిపోగా అధికారులు వెంటనే సరిచేశారు.
షాబాద్ మండలం నాగరకుంట, సోలిపేట గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించగా వెంటనే సరిచేశారు.
నవాబుపేటలోని పోలింగ్ కేంద్రంలో ఈవీ ఎం కొద్దిసేపు పనిచేయకపోవడంతో దానిని వెంటనే బాగుచేసి ఓటింగ్‌ను కొనసాగించారు.
పరిగిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీ ఎంలు మొరాయించటంతో ఓటర్లు ఇబ్బం దులకు గురయ్యారు. వెంటనే స్పందించటంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఓటర్లు గంటలతరబడి క్యూలో నిల్చోవాల్సి వచ్చింది.
పరిగి నెం-02 జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 160 పోలింగ్ కేంద్రం లో పోలింగ్ ప్రారంభం నుంచే ఈవీఎం మోరాయించింది. కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే అదనపు ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలో ఉన్నా వాటిని తేవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. అదే సమయంలో అక్కడి చేరుకున్న సార్వత్రిక ఎన్నికల పరిశీలకురాలు అముతవల్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు మరో ఈవీఎం తీసుకువచ్చి పోలింగ్ ప్రారంభించారు.
పరిగిలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ నెంబర్ 161లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. అక్కడకూడా కొత్త ఈవీఎం ఏర్పాటు చేశారు. గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమయ్యింది. దీంతో అంతసేపు ఓటర్లు క్యూలో నిల్చోని ఇబ్బందికి గురయ్యారు. వృద్ధులు, మహిళలు అక్కడే పక్కన కూర్చుండిపోయారు.
బషీరాబాద్ మండల పరిధిలోని పర్వత్‌పల్లిలో ఈవీఎంలు మొరాయించడంతో రెండు గంటలపాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ గంట పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. కొత్లాపూర్, ఇందర్‌చెడ్, తదితర గ్రామాల్లో కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించాయి.
మర్పల్లి పరిధిలోని తుమ్మలపల్లి 5వ పోలింగ్ బూత్‌లో 7 గంటలకు సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఈవీఎం మొరాయించింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఈవీఎంను సరిచేశారు. దీంతో 8.20 గంటలను పోలింగ్ ప్రారంభించారు.
వికారాబాద్ అసెంబ్లీ పరిధిలోని మర్పల్లి పోలింగ్ బూత్ నంబర్ 31లో ఈవీఎం పనిచేయకపోవడంతో వెంటనే అధికారులు లోపాన్ని సరిచేసి 8.30 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. పిల్లిగుండ్లలోని పోలింగ్ బూత్ నెంబర్ 10లో ఈవీఎంలో ఒక్క బటన్ నొక్కగా రెండు ఓట్లు పడుతుండడంతో అరగంటపాటు పోలింగ్ నిలిచిపోయింది.
మేడ్చల్ పట్టణంలోని పోలింగ్ స్టేషన్ 58లో ఈవీఎం మొరాయించడంతో ఆలస్యంగా ఓటింగ్ మొదలైంది. అత్వెల్లిలోని 13వ పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎం లోపం కారణంగా గంటన్నర ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. డబిల్‌పూర్‌లోని 10వ పీఎస్‌లో 106 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నాక ఈవీఎంలోని ఓటు బటన్‌ను ఓటర్ గట్టిగా నొక్కడంతో పని చేయడం మానేసింది. గంటసేపు ఓటింగ్ నిలిసిపోయింది. సోమారం బూత్‌లో ఇదే పరిస్థితి చోటుచేసుకోవడంతో అరగంటపాటు ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడింది.
కీసర మండలంలోని కరీంగూడ 194 పీఎస్‌లో, రాంపల్లిలోని ఆర్‌ఎల్‌నగర్‌లోని 197 పీఎస్‌లో, కీసరలోని 182 పీఎస్‌లో ఈవీఎంలు మొరాయించడంతో గంట ఆలస్యంగా ఓటింగ్ ప్రాంభమైంది. శామీర్‌పేట్ మండలం అలియాబాద్, బాబాగూడ, జవాహర్‌నగర్‌లోని 134, 135 పీఎస్‌లల్లో ఈవీఎంలు, ఘట్‌కేసర్ మండలం ఇస్మాయిల్‌ఖాన్‌గూడలలోని పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.
పరిగి నియోజకవర్గం సుల్తాన్‌పల్లిలో ఈవీఎం లోపం కారణంగా అరగంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రానికి ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు క్యూ కట్టారు. ఈవీఎం సరి చేసేంతవరకు కూడా అందరిని గేటు బయటే నిలబెట్టారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని ఓ ప్రైవేట్ పాఠశాల కేంద్రంలో ఈవీఎం మొండికేయడంతో పోలింగ్ ఆలస్యమైంది.
మొండికేసిన ఈవీఎంలు
Published Thu, May 1 2014 12:19 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement