జోరందుకున్న కారు | hopes on TRS party | Sakshi
Sakshi News home page

జోరందుకున్న కారు

Published Wed, Jul 2 2014 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

జోరందుకున్న కారు

జోరందుకున్న కారు

కరీంనగర్ కార్పొరేషన్ : మరో 24 గంటల్లో మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఏకంగా ఆ పార్టీ మేయర్ అభ్యర్థే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వలసలు ఆపేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో కార్పొరేటర్లు చేజారుతూనే ఉన్నారు. అందరూ గులాబీ చెంతన చేరుతుండడంతో బల్దియాలో కారు జోరందుకుంది.
 
 కరీంనగర్ మేయర్ పదవి దక్కించుకునేందుకు ఇప్పటికే పూర్తి మెజారిటీ సాధించి న టీఆర్‌ఎస్‌లో తాజాగా మరో ఐదుగురు కార్పొరేటర్లు చేరారు.
 
 ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రస్తుత మేయర్ అభ్యర్థి 34వ డివిజన్ కార్పొరేటర్ వావిలాల హన్మంతరెడ్డి, అదే పార్టీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత-చంద్రశేఖర్, స్వతంత్రులుగా గెలిచిన 11వ డివిజన్ కార్పొరేటర్ పిట్టల శ్రీనివాస్, 37వ డివిజన్ కార్పొరేటర్ రిజ్వానా బేగం-సలీంఖాన్, 49వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల భాగ్యలక్ష్మి టీఆర్‌ఎస్ అధినేత సమక్షంలో గులాబీదళంలో చేరారు. మాజీ కార్పొరేటర్ బీర్‌పూర్ నాగేశ్వర్ సైతం గులాబీ గూటికే వెళ్లారు. ప్రతిపక్షమనేదే లేకుండా పదవులన్నీ ఏకగ్రీవం చేసుకుని, అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేసిన ఎత్తులకు కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. మున్సిపల్‌లో 50 మంది కార్పొరేటర్లకు గాను 24 మంది టీఆర్‌ఎస్ వాళ్లు గెలుపొందగా, 14 మంది కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ, ఇద్దరు ఎంఐఎం, టీడీపీ ఒకరు, మిగతా ఏడు స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కాంగ్రెస్‌నుంచి ఐదుగురు టీఆర్‌ఎస్ బాట పట్టడంతో ఆ పార్టీ బలం 14 నుంచి 9కి పడిపోయింది. ఇంకా వలసలున్నాయని ప్రచారం జరుగుతుండడంతో ఆ పార్టీలో మిగిలేవారెందరనే ప్రశ్న తలెత్తుతోంది.
 
 కాంగ్రెస్ మేయర్ అభ్యర్థులిద్దరూ...
 కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలుగా వెలుగొంది, మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థులుగా బరిలో దిగిన వై.సునీల్‌రావు, వావిలాల హన్మంతరెడ్డి ఇద్దరూ పార్టీకి చేయిచ్చారు. నిన్న మొన్నటి వరకు మేయర్ బరిలో తామున్నామంటూ మెజారిటీ సీట్లు గెలుచుకోకున్నా.. చాపకింద నీరులా పావులు కదుపుతూ.. టీఆర్‌ఎస్ నేతలకు చెమటలు పట్టించిన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారు. మొన్న సునీల్‌రావుతోపాటు గూడూరి శారద, గంట కళ్యాణి, నేడు వావిలాల హన్మంతరెడ్డితో మెండి శ్రీలత-చంద్రశేఖర్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ భారీ నష్టాన్నే చవిచూస్తోంది.
 
 మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచే మేయర్ అభ్యర్థులుగా ప్రచారంలో ఉండి, అదే స్థాయిలో పార్టీ కార్పొరేటర్లను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషిచేసిన నేతలిద్దరూ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో బల్దియాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. వీరిని బుజ్జగించేందుకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం తదితరులు చేసి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారడంతో నేతలంతా తమ భవిష్యత్ కోసం పార్టీని వీడి అధికార పార్టీ పంచన చేరుతున్నారు. పార్టీనుంచి గెలిచిన 14 మంది కార్పొరేటర్లలో ఇప్పటికే ఐదుగురు టీఆర్‌ఎస్‌లో చేరడం, వలసలు ఇంకా ఉన్నాయని ప్రచారం జరుగుతుండడంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement