తగ్గని ఎండ
జూలై నెలలో వాతావరణం అంటే మబ్బులతో నిండిన ఆకాశం.. నిరంతరం కురిసే వర్షాలు.. చల్లటి గాలులు.. పచ్చటి పంట పొలాలు. కానీ, ఈ యేడాది పరిస్థితి మారింది. ఇప్పుడు మబ్బులు లేవు. చినుకు జాడ కానరావడం లేదు. పైగా భానుడు తన ప్రతాపాన్ని ఏ మాత్రం తగ్గించడం లేదు. చుర్రుమనిపించే ఎండలతో జనం అష్టకష్టాలు పడుతున్నారు.
పాలమూరు: వాతావరణం చల్లబడి వర్షాలు.. చల్లని గాలులు వీచాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ జనాలకు ఎండ బాధ తప్పడం లేదు. జూలై నెల వచ్చినా వాతావరణం ఇంకా ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఇంకా వడగాలులతో పాటు భానుడు విశ్వరూపం చూపిస్తుండటంతో ఉక్కపోత తప్పడం లేదు. గతేడాది జూలై నాలుగో తేదీన గరిష్ట ఉష్ణోగ్రత 30.1 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. శుక్రవారం 35.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయింది. కనిష్ట ఉష్ణోగ్రత సైతం గతేడాది జూలై నాలుగున 23.1 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. ఈ సారి 25.0 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే గరిష్ట ఉష్ణోగ్రత 5డిగ్రీల వరకు వరకు పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం వేసవిని తలపిస్తున్నాయి. దీంతో బయటకు రావాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలు కురిసి, చల్లగాలులతో ఆహ్లాదకరంగా ఉండాల్సిన వాతావరణం ఎల్‌నినో ప్రభావంతో పూర్తిగా మారిపోయింది. ఇది వానాకాలమా.. ఎండాకాలమా అని సందేహించే పరిస్థితులు తలెత్తాయి. దీనికి తోడు విద్యుత్ కోత తీవ్రంగా ఉంది. వేడికి ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు లేకుండా ఉండాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడుతున్నారు.