తలసాని దారెటు.. ?
హైదరాబాద్: పండుగ.. ఫంక్షన్.. ఊరేగింపు.. ఇలా కార్యక్రమం ఏదైనా సరే.. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనదైన శైలితో రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ గందరగోళం రేపుతున్నారు. కొంత కాలంగా టీడీపీ సైకిల్ వీడి.. టీఆర్‌ఎస్ కారెక్కుతారనే ప్రచారం జరుగుతుండగా, ఆయన వ్యవహార శైలి సైతం అందుకు అనుగుణంగానే ఉంటోంది. టీడీపీలో సీనియర్ నాయకునిగా, హైదరాబాద్ జిల్లా పా ర్టీ అధ్యక్షునిగా ఉన్న ఆయన టీఆర్‌ఎస్‌తోనూ అంతే సఖ్యతతో ఉండడం అయోమయానికి గురిచేస్తోంది. దసరా రోజున తమ కుమార్తె శ్వేత వివాహ నిశ్చయ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబును, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నూ ఆహ్వానించడంతో ఇద్దరూ హాజరయ్యారు. ఇలాంటి ఘటనలే గతంలోనూ చోటు చేసుకున్నాయి.
ఐడీహెచ్ కాలనీలో పేదల ఇళ్ల కోసమని నెలరోజుల క్రితం చంద్రశేఖర్‌రావును అక్కడకు రప్పించారు. ఆ హామీ మేరకు దసరా రోజున సదరు ఇళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. టీడీపీలో తాను కోరుకున్న పార్టీ శాసనసభాపక్ష నేత పదవి దక్కనప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారుతోంది. టీడీపీ- టీఆర్‌ఎస్ రెండు పార్టీలతోనూ సమదూరం పాటిస్తున్నారు. రెండు పడవల వైఖరి చివరకు ఏమజిలీకి చేరుతుందో అర్థం కాక పలువురు వేచి చూస్తున్నారు. కేసీఆర్‌తో గతంలో ఉన్న సాన్నిహిత్యం.. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదనే అంచనాలు.. తదితర పరిణామాలతో తలసాని టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నప్పటికీ.. ఆ విషయాన్ని స్పష్టం చేయకుండా.. కాదని ఖండిం చకుండా.. వ్యవహారాన్ని నడుపుకొస్తున్నారు. కాగా, టీఆర్‌ఎస్ ప్లీనరీ లోగా తలసాని టీఆర్‌ఎస్‌లో చేరేదీ, లేనిదీ స్పష్టం కానుందని రాజ కీయ పరిశీలకులు భావిస్తున్నారు.